సంచలనం రేకెత్తిస్తోన్న సీబీఐ వివాదానికి కేంద్రంలోని నలుగురు వ్యక్తులే కారణమని భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న అవినీతి అధికారులను జైలుకు పంపించకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు గెలుపు కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లోని నిర్మా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన యూత్ పార్లమెంట్‌కు హాజరైన స్వామి.. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ.. సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా, పీఎంవో అధికారులు పీకే మిశ్రా, భాస్కర్ ఖుల్బేపై విమర్శలు చేశారు. సీబీఐ పాలనా వ్యవస్థపై పైచేయి సాధించేందుకు ఈ నలుగురు అనేక తప్పులు చేశారని మండిపడ్డారు. ‘కేంద్రంలో ఓ నలుగురి గ్యాంగ్ ఉంది. ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో ఈ నలుగురు పి. చిదంబరంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ, దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వారు నడుచుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నేతలమైనే మేము ప్రజలతో మాట్లాడలేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున మేం ఎలా ప్రచారం చేయగలం? ప్రభుత్వంలోని అవినీతి అధికారులు జైలుకు పంపించకపోతే, నల్లధనాన్ని వెనక్కి తీసుకురాకపోతే వచ్చే ఎన్నికల్లో భాజపా ఓడిపోయే అవకాశముంది’ అని స్వామి అన్నారు.
నరేంద్రమోదీ దేశంలోనే ఉత్తమ ప్రధాని అని తాను నమ్ముతున్నానని, అయితే ఆయన అధికారుల ఎంపిక మాత్రం సరిగా లేదని స్వామి అన్నారు. దిల్లీ వాతావరణంలోనే అవినీతి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారు కేంద్రంలో చాలా మంది ఉన్నారని, వారి పేర్లు త్వరలోనే ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. ‘ఇలాంటి వారు మా ప్రభుత్వంలో ఉంటే ఇక ప్రతిపక్షమే అక్కర్లేదు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీ లాంటి వారు దేశం విడిచి పారిపోయేలా చేసింది వారే. చిదంబరంను కూడా కాపాడాలని చూస్తున్నారు. ఆలోక్ వర్మ నిజాయతీ గల అధికారి. ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ వెనక్కి తీసుకోవాలి’ అని స్వామి చెప్పుకొచ్చారు.