ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన తర్వాత అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే ఏపీలో టీడీపీని ఓడించాలని రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు, జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ ప్రాసెస్‌లో భాగంగానే బీజేపీ నేతలు అదే పనిగా, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిపై టీడీపీ నేతలు కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తుండడంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కేంద్రంలో సంగతి పక్కనపెడితే రాష్ట్రంలో బీజేపీని దెబ్బ కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిది అటు ఏపీలో, ఇటు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేయడంతో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అప్పుడు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగుతారా..? లేదా..? అనేది కూడా ఇప్పడు అనుమానంగా మారింది. అయితే, ఎవరు ఏ పార్టీలో చేరినా తాడేపల్లిగూడెంలో గెలిచిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో ఆ స్థానంలో మరోసారి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే, ఇక్కడి నుంచి టీడీపీ తరుపున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కూడా క్లారిటీ వచ్చేసిందట. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఉన్న ముల్లపూడి బాపిరాజును అధిష్ఠానం ఫిక్స్ చేసినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో గడచిన నాలుగేళ్ళల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఈయన తరచూ వార్తల్లో నిలిచేవారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఈయన టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ కోరడంతో ఆయన స్థానిక సంస్థలకు పోటీ చేశారు.