ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. పార్టీలు చేస్తున్న హడావిడికి తోడు నాయకులు చేస్తున్న ఫీట్లు ఆకట్టుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న రాజకీయం సంచలనం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలనుకుంటున్న జగన్.. ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే, అవి ఆ పార్టీకి ప్లస్ అవ్వకపోగా మైనస్ అవుతున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టేందుకు జగన్ ఎన్నో ప్లాన్లు చేస్తుండగా, అంతే స్థాయిలో చంద్రబాబు కూడా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. టీడీపీ అధినేత ఎదురుదాడికి దిగుతుండడంతో ప్రతిపక్ష పార్టీకి ఛాన్స్ దొరకడంలేదు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కీలక నేతలు తమ భవిష్యత్ కోసం మార్గాలను అన్వేషించుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ కంచుకోటలాంటి జిల్లాలో టీడీపీకి చెందిన ఓ నేత వైసీపీ కండువా కప్పుకోగా, ఓ మాజీ ఎమ్మెల్యే టీడీపీ గూటికి చేరిపోయారు. తాజాగా ఏపీలో జరుగుతున్న ఈ పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి.ఆనంతో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు అక్కడి ముఖ్య నేతలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేశారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన బలమైన నేత బొల్లినేని కృష్ణయ్యను టీడీపీలోకి ఆహ్వానించారు. ఇన్ని రోజులు చంద్రబాబు ఆహ్వానాన్ని పక్కన పెట్టిన ఆయన తాజాగా ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్యను పార్టీలోకి ఆకర్షించడానికి చంద్రబాబు ఎంతో ప్రయత్నించారని ప్రచారం జరిగింది. అయితే మేకపాటి కుటుంబంతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా బొల్లినేని టీడీపీలో చేరడానికి నిరాకరించారు. ఆ ఎన్నికల్లో మేకపాటి కుటుంబం గెలవడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడిన తరువాత ఆత్మకూరులో గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించడం కోసం అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య టీడీపీలో చేరడంతో అక్కడి టికెట్ ఆయనకేననే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు చంద్రబాబు ఆయనకు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ప్రతిపక్ష పార్టీలో కలవరం మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.