భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు కత్తిమీద సాములా తయారయ్యాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు ఈ ఉప ఎన్నికలు సవాల్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత యడ్యూరప్ప పైనే ఉంది. కేంద్ర నాయకత్వం ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైతే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందని భావించిన బీజేపీ కేంద్ర నాయకత్వం రెండు లోక్ సభ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుని రావాలని యడ్డీని ఆదేశించడంతో ఆయన కిందా మీదా పడుతున్నారు.నిజానికి శివమొగ్గ పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలంగానే ఉంది. యడ్డీ సొంత ప్రాంతం కావడం, తన సామాజిక వర్గం ఓటర్లు అండగా నిలబడటంతో ఆయనకు శివమొగ్గపై తొలినాళ్లలో పెద్దగా బెంగలేదు. అందుకే తన కుమారుడు రాఘవేంద్రను బరిలోకి దించి ఆయన కొంత ఊరట చెందారు. అయితే గత ఎన్నికలలకు, ఈ ఎన్నికలకు తేడా ఉంది. కాంగ్రెస్, జనతాదళ్ లు కలసి పోటీ చేస్తున్నాయి. శివమొగ్గలో జనతాదళ్ ఎస్ తన అభ్యర్ధిగా బంగారప్ప తనయుడు మధు బంగారప్పను బరిలోకి దించింది. శివమొగ్గను సవాల్ గా తీసుకున్న ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఇప్పటికే ఒకసారి శివమొగ్గలో ప్రచారం చేసి వెళ్లారు. కాంగ్రెస్, జనతాదళ్ కలసి ఇక్కడ జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తుండటంతో యడ్డీలో టెన్షన్ ప్రారంభమైంది.జనతాదళ్ ఎస్ కన్నా కాంగ్రెస్ నేతలే ఎక్కువ శివమొగ్గలో శ్రమిస్తున్నారు. ఇక్కడ యడ్యూరప్ప కుమారుడిని ఓడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమ బలం ఏంటో తెలుస్తుందని కాంగ్రెస్ నేతలు శివమొగ్గపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో యడ్యూరప్ప కూడా తన కుమారుడు రాఘవేంద్ర గెలుపు కోసం తాను కూడారంగంలోకి దిగారు. శివమొగ్గలో ఫలితం తారుమారైతే తనకు వ్యక్తిగతంగా అప్రదిష్ట చేకూరడంతో పాటు పార్టీ కూడా బద్నామ్ అవుతుందని భావించిన యడ్డీ ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పడు మారస్తూ తనయుడికి దిశానిర్దేశం చేస్తున్నారు.మరో సిట్టింగ్ స్థానమైన బళ్లారి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీకి గెలుపు అంత ఈజీకాదు. అక్కడ మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి శాంతని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. బళ్లారి లో అభ్యర్థి గెలుపు బాధ్యతలను శ్రీరాములుకే అప్పగించినా యడ్డీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బరిలో నిలిచింది. కాంగ్రెస్ ఇక్కడ మంత్రి డీకే శివకుమార్ ను ఇన్ ఛార్జిగా నియమించింది. వ్యూహాలను రచించడంలో దిట్ట కావడంతో బీజేపీ బళ్లారిలో కొంత అయోమయంలో పడింది. గాలి జనార్ధన్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం, మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలు కూడా త్వరలోనే బళ్లారిలో మకాం వేస్తుండటం బీజేపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పాలి. మొత్తం మీద రెండు సిట్టింగ్ స్థానాలను యడ్డీ నిలబెట్టుకుంటారో? లేదో? చూడాలి.ః