ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ నేత ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శివా రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి గాయం కారణంగా నొప్పితో జగన్ ఇబ్బందిపడటంతో పెయిన్ కిల్లర్ ఇచ్చామన్నారు. గాయం మానడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కండరానికి, చర్మానికి కలిపి 8 కుట్లు పడ్డాయన్నారు. రక్తం నమూనాలను ల్యాబ్‌లకు పంపామన్నారు. జగన్ ఆసుపత్రి బయటకు అడుగు పెట్టగానే ఆయన్ను చూసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలతో సిటీ న్యూరో ఆసుపత్రి ప్రాంగణాన్ని హోరెత్తించారు. దీంతో అభిమానులకు చేతితో అభివాదం చేసిన జగన్ కారులో తన ఇంటికి ప్రయాణమయ్యారు.