భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రవేశపెట్టిన పెన్షన్ ప్లాన్ 'జీవన్ శాంతి' కి అద్భుతమైన స్పందన వచ్చిందని ఎల్‌ఐసీ వారు తమ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో తెలియజేసారు. ఈ సందర్భంగా జోనల్ సంస్థ మేనేజర్ శ్రీ టీసీ.సుశీల్ కుమార్ గారు మాట్లాడుతూ తమ నూతన పెన్షన్ ప్లాన్ 'జీవన్ శాంతి'కి మార్కెట్లో గొప్ప ఆదరణ లభిస్తున్నదని, పాలసీ అమ్మకాలు ఆకర్షణీయంగా ఉన్నాయని అయన అన్నారు. ఈ పథకం వచ్చిన 40 రోజుల్లోనే మార్కెట్ నుంచి మంచి స్పందన లభించిందని, ఈ నెల 24 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రొడక్ట్ ద్వారా వచ్చిన కొత్త బిజినెస్ ప్రీమియం రూ.2,300 కోట్లకు చేరుకుందని ఆయన చెప్పారు. కాగా సౌత్ సెంట్రల్ రీజియన్‌లో ఈ ప్రొడక్ట్ ద్వారా వచ్చిన బిజినెస్ ప్రీమియం రూ.275 కోట్లుగా ఉందని సుశీల్ కుమార్ తెలిపారు. ప్రస్తుత యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. 30 ఏళ్ల నుంచి 100 ఏళ్ల లోపున్న వారు ఎవరైనా ఈ యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవచ్చని తెలిపారు.