ఒడిశా, ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించిన తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను కేంద్రం ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి కోరారు. తిత్లీ ప్రబావిత ప్రాంతాలకు జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆయన శుక్రవారం లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందని లేఖలో పేర్కొన్నారు. 3లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు, 10వేల గృహాలు దెబ్బతిన్నాయని రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.