ఎన్నికలు దగ్గరపడే సమయం కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం పైనే అందరి దృష్టి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా ఈసారి కైవసం చేసుకోవాలని చంద్రబాబు గట్టిపట్టుదలతో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఆరేడు నియోజకవర్గాలను శాసించే పెద్దిరెడ్డిని దెబ్బకొట్టాలన్నది చంద్రబాబు వ్యూహం. పెద్దిరెడ్డికి ఊపిరాడనివ్వకుండా చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురవేయవచ్చన్నది టీడీపీ అధినేత వ్యూహంగా కన్పిస్తోంది. అందుకే ఏరి కోరి మంత్రి అమర్ నాధ్ రెడ్డి మరదలు అనూషారెడ్డికి పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జిగా బాధ్యతలను అప్పగించారు.నిజానికి పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జి అనూషారెడ్డిది కడప గడపే. ఆమె పుట్టినిల్లు కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారి పల్లె. అనూషారెడ్డి ముత్తాత గంగిరెడ్డి కడప జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. తాత నారాయణరెడ్డి రాయచోటి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. తండ్రి రఘురామిరెడ్డి బాలిరెడ్డిగారిపల్లె సర్పంచ్ గా, సింగిల్ విండో అధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. అనూషారెడ్డి పుట్టక ముందే ఆ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అందుకే ఆమె గత రెండు దఫాలుగా పుంగనూరు టిక్కెట్ ను కోరుతున్నా అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి గట్టిగా ప్రయత్నం చేయడం, పెద్దిరెడ్డిని ఎదుర్కొనే వారు నియోజకవర్గంలో ఎవరూ లేకపోవడంతో ఆమెకే చంద్రబాబు టిక్కెట్ ను దాదాపుగా ఖరారు చేశారు.అనూషారెడ్డి ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. పెద్దిరెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదని ఆమెకూ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థికంగానూ, అంగబలంలోనూ బలవంతుడు. గతంలో పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెంకటరమణ రాజు వరుసగా పెద్దిరెడ్డి చేతిలో ఓటమినే చవి చూస్తున్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల మనిషి అని ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సమస్యలను సొంత నిధులతో పరిష్కరిస్తుండటం పెద్దిరెడ్డికి ప్లస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అనూషారెడ్డి మాత్రం ధైర్యంగానే, గెలుపు ధీమాతోనే ప్రజల మందుకు వెళుతున్నారు. ఆమె పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.కష్టపడితే పెద్దిరెడ్డిని ఓడించడమేమీ కష్టంకాదని ఇటీవల చిత్తూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు సయితం అభిప్రాయపడ్డారు. అనూషారెడ్డి పార్టీలో లీడర్ల దగ్గర నుంచి క్యాడర్ వరకూ అందరితో కలుపుగోలుతనంగా ఉండటం కూడా ఆమెకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మండలాల వారీగా పార్టీ నేతలను, కార్యకర్తలను అనూషారెడ్డి క్షణం తీరికలేకుండా కలుస్తున్నారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనూషారెడ్డి ప్రయత్నిస్తున్నారు. పెద్దిరెడ్డి పై గెలిచినా, ఓడినా అనూషారెడ్డి మాత్రం చిత్తూరు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.