ముఖ్యమంత్రి అభ్యర్థిని హతమార్చి ఎన్నికలకు పోవాలనుకునే ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. జగన్ కు ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం లేదు, ఏపీ అసెంబ్లీ మీద నమ్మకం లేదు, ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, తెలంగాణా పోలీసుల మీద మాత్రం నమ్మకం ఉందట. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంటే గవర్నర్ పట్టించుకోడు. వైకాపా నేతలు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో జగన్ కు తెలుస్తోందా అని అడిగారు. 'అతడు' సినిమాలోని సీన్ ను రాష్ట్రంలో నడపాలని చూశారు. ఎన్నికలకు ముందు సానుభూతి కోసం హత్యాయత్నం డ్రామా 'అతడు' సినిమా తరహాలోనే ఉంది. కోడికత్తి గుచ్చుకుంటే భాజపా నేతలు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తున్నారు. పొడిచిన కత్తిని బొత్స మేనల్లుడు శీను 2గంటలు తన వద్ద ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. రక్తపు మరకలు లేని కత్తిని 2గంటల తర్వాత పోలీసులకు ఎందుకిచ్చారు. ఇంత దిగజారుడు రాజకీయాలతో రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని నిలదీసారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చెత్త రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించి ఉన్న పరువు పోగొట్టుకున్నారు. ఎన్నికల్లో చేసింది చెప్పుకుని ఓటు అడిగే దమ్ము మాకుంది. ధైర్యంగా ఎన్నికలకు వెళ్లే మాకు ఇలాటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు. కడప జిల్లా పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ కోడి కత్తి గుచ్చుకుంటే పడకేస్తాడా అని అన్నారు. చవకబారు రాజకీయాలతో వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దని అన్నారు.