YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రైల్వే జోన్ స్పష్టమైన ప్రకటన..?

రైల్వే జోన్ స్పష్టమైన ప్రకటన..?

హామీల అమలుకు ముందుకొచ్చిన కేంద్రం 

పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. రెవెన్యూలోటు భర్తీ, విశాఖ రైల్వే జోన్‌ సహా విభజన చట్టంలోని హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయడానికి ముందుకొచ్చింది. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ నిధులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 
హామీల అమలుకు ముందుకొచ్చిన కేంద్రం 
పార్లమెంటు ఉభయ సభల్లో ఐదురోజుల పాటు ఏపీ ఎంపీలు చేసిన పోరాటం కొంతవరకు ఫలించింది. విభజన చట్టంలోని హామీలన్నింటీని అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళనలపై స్పదించిన బీజీపీ అధ్యక్షుడు అమిత్‌ షా.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, రైల్వే మంత్రి పియూష్‌  గోయల్‌, ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజనచట్టంలోని హామీలు కోసం ఎంపీలు చేస్తున్న ఆందోళనపై రెండున్నర గంటపాటు చర్చించారు. రాష్ట్రానికి వ్వాల్సిన నిధులు, సంస్థలు, రైల్వే జోన్‌ ప్రకటన, దుగరాజపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల అమలుపై ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. పార్లమెంటు నిబంధనల ప్రకారం పలు మంత్రిత్వ శాఖల అంశాల ప్రస్తావన చేయకూడదన్న విషయాన్ని అరుణ్‌ జైట్లీ ప్రస్తావించారు. వచ్చే నెల 5 నుంచి పార్లమెంటు రెండవ దశ సమావేశాలు ప్రారంభమయ్యే లోగా అన్ని ప్రకటనలు పూర్తి చేసి కార్యారణకు వెళ్లాలని నిర్ణయించారు. 


రెవెన్యూ లోటు భర్తీకి ఒప్పుకున్న కేంద్రం  
రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 10 నెలల కాలానికి ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఒప్పుకున్నారు. దీంతోపాటు మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఇచ్చేందుకు అంగీకరించింది. ఇవి త్వరలోనే ఏపీకి అందే అవకాశం ఉందని  భావిస్తున్నారు. ఇకపై ప్రతిఏటా ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సూత్రప్రాయంగా ఒప్పుకుంది.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ..!
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. ఏ నిమిషంలో నైనా రైల్వే జోన్‌ ప్రకటించాలని అరుణ్‌ జైట్లీ ... రైల్వే మంత్రిని ఆదేశించడంతో పియూష్‌ గోయల్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు.   అలాగే ఇంకా ప్రకటించాల్సిన సంస్థలతోపాటు ఇప్పటికే మంజూరు చేసిన సంస్థలకు నిధులు విడుదలకు కేంద్రం ఒప్పుకుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన ఖర్చుల వివారాలపై నివేదిక ఇస్తే,  నిధుల విడుదలకు అంగీకరించింది. ప్రత్యేక  హోదాతో వచ్చే నిధులను ఒకేసారి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ఈఏపీ నిధుల సర్దుబాటుకు కేంద్రం సిద్ధమైంది. అలాగే దుగరాజపట్నం పోర్టు విషయంలో ఇస్రో నుంచి  అభ్యంతరాలు  ఉన్న విషయంపై చర్చించారు. దుగరాజపట్నంకు బదులు మరో ప్రాంతంలో ఓడరేవును రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదిస్తే కేంద్రం ఆమోదిస్తుందని మంత్రులు చెప్పారు. కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించే అంశాన్నిసూత్రప్రాయంగా అంగీకరించారు. దీనిపై అధ్యయనం చేస్తున్న మెకాన్‌ సంస్థ ఈనెల 12న నివేదిక ఇస్తుందని అరుణ్‌ జైట్లీ సుజనాచౌదరి దృష్టికి తెచ్చారు.  పెట్రో రసాయనాల సముదాయం ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని అరుణ్‌జైట్లీ గుర్తు చేశారు. ఈ అంశాలపై కేంద్ర  ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. మూడున్నరేళ్లుగా చేస్తున్న ఉత్తుత్తి ప్రకటనలతో విసిగిపోయిన ప్రజలు నిర్దిష్ట కార్యాచరణను ప్రకటించిన అమలు చేస్తేనే కేంద్రాన్ని నమ్ముతారు. 

Related Posts