అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నవ్యాంధ్ర విద్యారంగాన్ని తీర్చిదిద్దే క్రమంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూనివర్శటీ ఆఫ్ సిన్సినిటీతో పలు ఒప్పందాలు చేసుకునేదిశగా ముందుకెళ్లుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరిశోధన, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ర్టీయల్ డిజైన్, పిడియాట్రిక్స్ తదితర రంగాల్లో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో యూనివర్శటీ ఆఫ్ సిన్సినిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. యూనివర్శటీ ఆఫ్ సిన్సినిటీ లో చదువుకునే ఏపీ విద్యార్థులకు ఫీజు రాయితీ అందేలా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు వర్శటీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నామని, తద్వారా ఏపీ విద్యారంగంలో మరింతగా విద్యా ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నవ్యాంధ్రలోని ఆచార్య నాగార్జున వర్శటీ, ఎస్వీ యూ, కెఎల్ వర్శటీలను యూనివర్శటీ ఆఫ్ సిన్సినిటీ ప్రతినిధులు బృందం సందర్శించింది. ఈ సందర్శన, అధ్యయనానికి సంబంధించిన వివరాలను వారు మంత్రి గంటాకు వివరించారు. ఏ యే అంశాల్లో తాము ఆసక్తిగా వున్నామో వివరించారు. ఏపీలో పరిశోధన కేంద్రంపై ఆసక్తితో వున్నామని, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ అంశాలపై భాగస్వామ్యం చేసుకుంటామని వారు మంత్రి గంటాకు తెలిపారు. ఇండస్ట్రీయల్ డిజైన్, పిడియాట్రిక్స్, ఆర్కిటెక్చర్ రంగాల్లో బెస్ట్ వర్శటీగా వర్శటీ ఆఫ్ సిన్సినిటీ గుర్తింపు పొందింది. 200 సం.ల క్రితం స్థాపించిన వర్శటీగా సిన్సినిటీ గుర్తింపు పొందింది.మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ సలహాదారు డాక్టర్ ఈదర వెంకట్ ఆధ్వర్యంలో ఈ బృందం 24,25,26 తేదీల్లో ఏఎన్ యూ, ఎస్వీయూ, కె ఎల్ వర్శటీలను సందర్శించింది. అక్కడి విద్యార్థులు, ఫ్యాకల్టీలతో చర్చించింది. ఇక్కడి కోర్సులు, అవసరాలను అధ్యయనం చేసింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వర్శటీలకు అనుసంధానించిన సాంకేతిక వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీలు, ల్యాబ్ లు, పరిశోధన వ్యవస్థ లను పరిశీలించింది. విదేశీ విద్యార్థులు ఇక్కడ ఏయే కోర్సులు ప్రత్యేకించి ఫైన్ కోర్ట్స్ లు నేర్చుకునే అవకాశాలను అధ్యయనం చేసింది. వర్శటీ ప్రతినిధి బృందంలో వర్శటీ వైస్ ప్రొకొస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ మెహతా, పొలిటికల్ సైన్స్ లీడ్ ప్రొఫెసర్ లౌరా జన్ కిన్స్, డాక్టర్ అమిత్ రాతౌరీ, డైరక్టర్ ఆఫ్ ఇంటర్నేషన్ స్ట్రాటజిక్ పార్టనర్స్ గౌరీబాలన్ వున్నారు.