విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి, వేద పురాణాగమాలు ఆ శక్తి తాలూకు వివిధ కోణాలను వివిధ రూపాలుగా ఆవిష్కరించాయి. వాటి ఉపాసనా విధులను ఏర్పరచాయి.
ఆ పద్ధతిలో 'సప్త మాతృకా' తత్వం ఒకటి.
శుంభునిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో, భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణించింది.
1. బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి',
2. విష్ణుశక్తి 'వైష్ణవి',
3. మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి',
4. స్కందుని శక్తి 'కౌమారి',
5. యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి',
6. ఇంద్రుని శక్తి (ఐంద్రి),
7. అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి 'కాళి' (చాముణ్డా)
వీటిని 'సప్త మాతృకలు' అంటారు.
ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు.
ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివ శక్తులు, నిజానికి ఒకే శక్తి తాలూకు వివిధ వ్యక్తీకరణలు.
1. బ్రాహ్మి:-
అనంతాకాశంలో, హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర, అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వ శాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం.
2. వైష్ణవి :-
విశ్వమందంతటా తేజస్త రంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి ఈ తల్లి.
3. మహేశ్వరి :-
ప్రతివారి హృదయంలో 'అహం' (నేను) అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. 'సర్వ భూత హృదయాల్లో ఈశ్వరుడే, శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు' అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం ఈ భావాన్నే చెబుతున్నది.
4. కౌమారి :-
సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి కౌమారి.
5. వారాహి :-
ఈ యజ్ఞ వరాహశక్తి అన్న ప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తినీ, అన్నపరిణామాన్నీ (మార్పునీ) తెలియజేసే సంకేతాలు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి.
6. ఇంద్రాణి:-
జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి.
7. చాముండి :-
కథ ప్రకారం - రక్తబీజుడనే రాక్షసుని దేవి సంహరించేటప్పుడు, స్రవించే ప్రతి రక్తకణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే, 'చాముణ్డా' దేవి తన నాలికతో ఈ రక్తాన్ని పానం చేసింది. అప్పుడు ఆ అసురుడు హతమారిపోయాడు.
విషయ లంపటానికి సంకేతం రక్తబీజుడు. రకరకాల కామసంకల్పాలే రక్తకణాలు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర, అజ్ఞానశక్తులే అసురులు. వాటిని నిర్మూలించే సమాధిస్థితిలోని దివ్య చైతన్యం 'చాముణ్డా'.
ఏకం పరబ్రహ్మ తత్వం. అనేకం ప్రపంచ స్వరూపం. ఈ అనేకమే 'చమూ' (సేనలు). ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి. దీనినే 'చాముణ్డా' అని సంకేతించారు.
చండ, ముండ- అనే దనుజుల్ని సంహరించినందుకు 'చాముణ్డా'- అన్నారని మరో కథనం. యోగపరంగా చూస్తే- మూలాధారం నుంచి గ్రంథిని భేదించడం చండాసుర సంహారం. సహస్రార కమలంలో ప్రవేశించేటప్పుడు జరిగే భేదనం ముండాసుర సంహారం.
ఈ విధమైన తాత్విక, యోగదర్శనాన్ని కావ్యకంఠ గణపతి ముని సంభావించారు (ఉమా సహస్రం).
మొత్తంగా పరిశీలిస్తే -
1.విశ్వాన్ని నడిపే శక్తులు,
2.యోగసాధనవల్ల మనలో మేల్కొనే దివ్యశక్తులు -
వీటినే విభిన్న శక్తిరూపాలుగా పురాణాదులు ఆవిష్కరించాయని స్పష్టమవుతోంది.