వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రత్యేక హోదా సాధన సమితి నేత, సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. తనపై రోజా ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆమెపై పరువు నష్టం దావా కూడా వేయగలనని... కానీ, ఇప్పటికీ ఆమెను గౌరవిస్తున్నానని అన్నారు. తాను మాట్లాడాలనుకుంటే... రోజా కంటే నీచమైన భాషలో మాట్లాడగలనని చెప్పారు. తాను పల్నాడు ప్రాంతానికి చెందినవాడినని... బూతుల్లో పీహెచ్డీ ఏదైనా ఉంటే అది మా పల్నాడులోనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో జరగబోతున్న భయంకర పరిణామాల గురించే తాను 'ఆపరేషన్ గరుడ'కు సంబంధించిన వీడియోను విడుదల చేశానని శివాజీ అన్నారు. అందులో తాను బీజేపీ, వైసీపీ, జనసేనల పేర్లను ఎక్కడా ఉచ్చరించలేదని చెప్పారు. తన వీడియోను చూసి ఈ పార్టీల నేతలంతా... ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.