దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ హుండీ, దర్శనం టిక్కెట్టు, ప్రసాదాల విక్రయాల ద్వారా 11.06 కోట్లు ఆదాయం వచ్చిందని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీ ఆదాయం 5.88 కోట్లు, ఇతర సేవలు, ప్రసాదాల ద్వారా 5.17 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దసరా ఏర్పాట్లకు 8.40 కోట్లు ఖర్చుపెట్టామని చెప్పారు. ఉత్సవాల్లో 2.32 లక్షల మందికి అన్నప్రసాదాన్ని, 7.86 లక్షల మందికి అప్పం, 8.50 లక్షల మందికి కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు.దేవస్థానం ఉద్యోగులు, పాలకమండలి సభ్యులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయడం ద్వారా లక్షలాది భక్తులకు అమ్మవారి దర్శనం చేయించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో భవానీ దీక్షల స్వీకరణ, విరమణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిబ్బందిని కోరారు. శాశ్వత ప్రసాదాల పోటు, అన్నప్రసాద కేంద్రం నిర్మించేందుకు ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యుల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.