విరాట్ కొహ్లీ అండ్ కో సౌతాఫ్రికా గడ్డపై సంచలనం సృష్టించడానికి సన్నద్ధమైంది. సఫారీ ల్యాండ్‌లో తొలి వన్డే సిరీస్ విజయానికి టీమిండియా తహతహలాడుతోంది. తొలి 3 వన్డేల్లో తిరుగులేని టీమిండియా ఇవాళ జరిగే 4వ వన్డేలోనూ నెగ్గి.. సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
దక్షిణాఫ్రికాలో భారత జట్టు చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. జోహన్నెస్‌బర్గ్‌లో భారత్..సౌతాఫ్రికా 4వ వన్డేకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తొలి 3 వన్డేల్లో తిరుగులేని టీమిండియా 4వ వన్డేతోనే సిరీస్ నెగ్గాలని పట్టుదలతో ఉంది. డర్బన్, వాండరర్స్, కేప్‌టౌన్ వన్డేల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఆతిధ్య సౌతాఫ్రికా జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. 6 మ్యాచ్‌ల సిరీస్‌లో 3..0తో ఆధిక్యంలో ఉన్న భారత్....సౌతాఫ్రికాలో తొలి వన్డే సిరీస్ విజయం సాధించి చరిత్రను తిరగరాయాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో పాటు స్పిన్ ట్విన్స్ యజ్వేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ మ్యాజిక్‌తో ఇప్పటివరకూ వన్డే సిరీస్‌లో భారత్‌కు పోటీనే లేకుండా పోయింది.
ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా డామినేట్ చేస్తోన్నా...వన్డే ఓవరాల్ ఫేస్ టు ఫేస్ రికార్డ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 80 వన్డేల్లో పోటీ పడగా...భారత్ 32 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 45 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆల్‌రౌండ్ పవర్‌తో అన్ని విభాగాల్లో ఆతిధ్య దక్షిణాఫ్రికా కంటే పటిష్టంగా ఉన్న టీమిండియాకే 4వ వన్డేలోనూ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు.