ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నవారు రేపు మరో పార్టీలోకి మారేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏ పార్టీ తమకు సీటిస్తుందో చూసుకుని అటువైపు దూకుతున్నారు. తాజాగా బిజెపి సీనియర్ నాయకురాలు, నందమూరి తారకరామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఎలాగైనాసరే టీడీపీలో చేరాలని, తనకు అందుబాలో ఉన్న సకల ప్రయత్నాలు చేస్తున్నారని భోగట్టా. ఈ ప్రయత్నంలో బంధువుల సహాయం కూడా అర్దిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె తరపున ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సీఎం చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంలేదట. ఫలితంగా పురందేశ్వరి టీడీపీలో చేరేందుకు బంధువులపై ఒత్తిడి పెంచుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బంధువర్గమంతా ఒకచోట చేరినపుడు ఈ అంశంపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. తమ కుటుంబమంతా టిడిపిలో చేరుతుందని, అయితే తన కుమారునికి పర్చూరు టిక్కెట్ ఇస్తే చాలునని ఆమె కోరుతున్నారని భోగట్టా. తనకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పరవాలేదుగానీ, తన కుమారుని రాజకీయ భవిష్యత్ కోసం అతనికి టిక్కెట్ ఇవ్వాలని పురందేశ్వరి అడిగారని సమాచారం. ఇలా టిక్కెట్ అడగడానికి గల కారణాన్ని కూడా ఆమె చూపారట. ప్రస్తుతం పర్చూరులో ఉన్న టిడిపి ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీనిని తొలగించాలంటే తన కుమారునికి టిక్కెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారట. తమ కుమారుడు పర్చూరు నుంచి సులభంగా విజయం సాధించేందుకు అవకాశాలున్నాయని ఆమె అంటున్నారట. దీనికితోడు తన భర్త దగ్గుబాటి కుటుంబం కారణంగా ప్రకాశం లో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని అంటున్నారట. అలాగే తన భర్త వెంకటేశ్వరరావు కూడా టీడీపీ బలోపేతానికి సహకరిస్తారని పురందేశ్వరి అందరితో చెబుతున్నట్లు సమాచారం. పైగా ఆమె కుమారుడు టిడిపి తరుపున అయితేనే పోటీ చేస్తానని, లేదంటే ఊరికే ఉంటానని చెబుతున్నరట. దీంతో పురంధేశ్వరి తన కుమారుని కోసం టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారట. ఇదిలావుండగా మొన్నటి వరకూ ఆమె జగన్ లేదా పవన్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అలాగే ఆమె విజయవాడ నుంచి జగన్‌పార్టీ తరుపున పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అక్కడ దాసరి జై రమేష్‌కు టిక్కెట్ ఖాయంమైందని తెలుస్తోంది. దీంతో ఆమెకు అక్కడి నుంచి టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నరని సమాచారం. ఈ నేపద్యంలో ఆమె పవన్ పార్టీలోకి వెళదామనుకుంటే అక్కడ ఏమి జరగనుందో ఎవరికీ అర్థం కావడం లేదని వాపోతున్నారట. దీంతో టీడీపీనే ప్రత్యామ్నాయంగా ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడే ఆమెకు చిక్కుసమస్య ఎదురవుతున్నదంటున్నారు. ఆమె టీడీపీలోకి వస్తానని అంటున్నప్పటికీ, చంద్రబాబు ఇంతవరకూ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. బందువుల ద్వారా ప్రయత్నాలు చేస్తే సఫలమవుతాయిని పురందేశ్వరి భావిస్తున్నారట. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.