చదలవాడ కృష్ణమూర్తి. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీలో ఒకప్పుడు చక్రం తిప్పి, ఏకంగా చంద్రబాబునే మెప్పించిన నాయకుడిగా కూడా చదలవాడకు పేరుంది. గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా 1999లో టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. అదేవిధంగా పార్టీలోనూ పట్టు సాధించారు. 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్‌గా బాబు ఆయనకు అవకాశం కల్పించారు. ఇలా టీడీపీలో గుర్తింపు సాధించిన చదలవాడ.. తన చైర్మన్ పదవిని రెన్యువల్ చేయాలన్న విజ్ఞాపనతో విభేదించిన చంద్రబాబుకు దూరంగా కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ తిరుపతి నుంచి పోటీ చేయాలని భావించారు. అసెంబ్లీకి పోటీ చేస్తానని గతం కొంతకాలంగా ఆయన తన అనుచరులతో చెబుతూ వచ్చారు. 2014లోనే టీడీపీ తిరుపతి టికెట్ దక్కించుకోవాలని చూశారు. అయితే, ఎం. వెంకటరమణకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో కీలకమైన టీడీపీ బోర్డు చైర్మన్ పదవిని చంద్రబాబు ఆఫర్ చేశారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీచేయాలని చదలవాడ నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పటికే చంద్రబాబుతో విభేదించి ఉండడం, ఇక్కడ సుగుణమ్మ రంగంలో ఉండడం, ఒకవేళ ఆమెను మారిస్తే.. చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రయత్నించినా ఫలితం లేదని నిర్ణయించుకున్న చదలవాడ.. అనూహ్యంగా జనసేనలో చేరిపోయారు. ఉరుములు లేని వర్షం మాదిరిగా ఆయన పవన్ పక్షాన చేరి.. పవన్‌కు జై కొట్టారు. దాదాపు తిరుపతి టికెట్ కూడా చదలవాడకు ఖరారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల చదలవాడ రెచ్చిపోయారు.టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘తిరుపతి ఎమ్మెల్యే దివంగత వెంకటరమణ, ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు అధికారం అడ్డుపెట్టుకుని ఆస్తులు కూడబెట్టారు. డబ్బుంటేనే తిరుపతిలో గెలుస్తారనుకోవడం భ్రమ. తిరుపతిలో కొందరి ఇళ్ల చుట్టూ దళారులు శ్రీవారి టిక్కెట్లు కోసం తిరుగుతున్నారు. శ్రీవారి దాతల పుస్తకాలు తిరుపతిలోనే ఒకరి దగ్గరే వున్నాయి. భర్త చనిపోతే ఖాళీగా వచ్చి ఆమె నేనే ఎమ్మెల్యే అంటూ వచ్చింది. పార్టీలో ఒక్క రోజు కూడా నన్ను గుర్తించలేదు. మూడు, నాలుగేళ్లలో నా ఫొటో కూడా ఎక్కడా వేయలేదు. ఎవరైనా ఫ్లెక్సీల్లో నా ఫొటో వేస్తే ఎమ్మెల్యే వాళ్లు ఇంటికి పిలిపించుకుని వారిని బెదిరించేవాళ్లు. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ అర్బన్ హాట్ ఎదుట స్థలాన్ని ఆక్రమించారు.’’ అంటూ విరుచుకుపడ్డారు చదలవాడ. దీనికి కౌంటర్‌గా సుగుణమ్మ కూడా వెనక్కి తగ్గకుండానే సమాధానం చెప్పింది. మొత్తంగా ఇక్కడ చదలవాడ మరోసారి మీడియా ముందుకు రావడం, టీడీపీని టార్గెట్ చేయడం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో పొటీ ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.