హైదరాబాద్ నగరంలో వస్తున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో నవంబర్, డిసెంబర్ మాసంతం వరకు స్వైన్‌ప్లూ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుందని, ఈ రెండు నెలలు స్వైన్‌ప్లూ నివారణకు తగు జాగ్రత్తలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ నగరవాసులకు సూచించారు. నగరంలో స్వైన్‌ప్లూ, డెంగ్యు, మలేరియా తదితర వ్యాధుల నివారణ చర్యలపై జీహెచ్ఎంసీ ఎంటమాలజి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు, మలేరియా అధికారులతో నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ రవికిరణ్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో దానకిషోర్ మాట్లాడుతూ హెచ్-1, ఎన్-1 వైరస్ ద్వారా సోకే స్వైన్‌ప్లూ సంక్రమిస్తుందని, జ్వరం, జలుబు, తలనొప్పి, ఆయాసం, ఒంటినొప్పులు లక్షణాలు వారం రోజులకు పైబడి ఉంటే సమీపంలోని పట్టణ ప్రాథమిక కేంద్రాలను సంప్రదించాలని సూచించారు
హైదరాబాద్ నగరంలో మూసి పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువగా స్వైన్‌ప్లూ కేసులు నమోదు అవుతున్నాయో ఆయా ప్రాంతాల్లో మరింత ఉదృతంగా ఫాగింగ్‌ను నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో జ్వరంతో బాధపడే పిల్లల వివరాలను విద్యాశాఖ ద్వారా సేకరించి వారికి తగు చికిత్స అందించాలని దానకిషోర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థుల్లో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి బి-కాంప్లెక్స్ టాబ్లెట్లను పంపిణీ చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. నగరంలో అంటువ్యాధుల నివారణపై పెద్ద ఎత్తున ప్రచార, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు.స్వైన్‌ప్లూ వ్యాధి హెచ్-1 హెచ్-1 వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఆయాసం, ఒంటినొప్పులు, ఊపిరి తీసుకోకపోవడం. పై లక్షణాలు వారం రోజులపైబడి ఉంటే దగ్గరలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని కోరారు.
హై రిస్క్ గ్రూపులు 1. గర్బిణీలు 2. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు, 3. 65 సంవత్సరాలపైబడిన వృద్దులు, 4. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
*చేయవలసినవి:* 1 చేతులను తరచుగా సబ్బుతో శుభ్రమైన నీటితో కడుకోవలెను. 2. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి అడ్డంగా చేతిరుమాలు లేదా చేతిని అడ్డం పెట్టుకోవలెను. 3 ఎక్కువ నీళ్లు త్రాగవలెను, పోషకాహారం తినవలెను. 4. దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండవలెను..
*చేయకూడనవి:* 1. ఇతరులను కలిసినప్పుడు చేతులు కలుపరాదు. 2. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. 3. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయరాదు. 4. డాక్టర్ సలహా లేకుండా స్వయంగా మందులు వాడరాదు.