YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

.వ్యవసాయ రంగంలో పరస్పరం సహకారం - మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

.వ్యవసాయ రంగంలో పరస్పరం సహకారం - మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీతో వ్యవసాయ రంగంలో పరస్పరం సహకరించుకునే అంశాలను పరిశీలించమని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరప పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం ఇది.

ఈ సందర్భంగా ఇరువైపుల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. వ్యవసాయం, వ్యవసాయ విద్య, బోధన,  పరిశోధన, విస్తరణ తదితర అంశాలలో మనకు ఉపయోగపడేవాటిని పరిశీలించమని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ అధికారులకు మంత్రి చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయాల  పరిధిలోని కాలేజీలు, పరిశోధనా కేంద్రాలు,  పాలిటెక్నిక్ కాలేజీలు, వ్యవసాయ, ఉద్యానవన పంటలు, వివిధ ప్రాంతాలలో వర్షపాతం వివరాలు, అధిక ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వర్షపాతం, వాతావరణం ఆధారంగా పండే పంటలను విశ్లేషించారు.

భూసార పరీక్షలు, చెరువులు, నీటి కుంటలు, ఫాం పాండ్స్,  భూగర్భజలాలు వంటి నీటి వనరుల లభ్యత, చెరువుల కింద సాగు, వివిధ జిల్లాలలో అత్యధికంగా పండించే పంటలు,  ద్రవ బయో ఫర్టిలైజర్, శాటిలైట్ ద్వారా పంటల పరిశీలన, వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, రైతుల ఫొటోలతోసహా  ప్రతి పొలంలో, తోటలలో పండే పంటలు నమోదయ్యే ఈ-పంట విధానం,  వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, కర్నూలు జిల్లాలో మెగా సీడ్ పార్కు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి పొందుతున్న సహకారం మొదలైన విషయాల గురించి వివరించారు.

న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ వారు కూడా వారి విశ్వవిద్యాలయం పనితీరు, పరిశోధనలు, వారి పరిశోధనా కేంద్రాలు, ప్రస్తుతం వ్యవసాయంలో ఎదుర్కొంటున్న అంశాలు, నీటి వనరులు, నీటి నిర్వహణ, సహజ వనరులు, ఆధునిక టెక్నాలజీ వినియోగం, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆధునిక సౌకర్యాలు, బయోమెడికల్ పరిశోధన, ఆహార రక్షణ, ఆహార రక్షణ కేంద్రాలు, సేంద్రీయ వ్యవసాయం, మిరప, కాటన్ పంటలు, డెయిరీ నిర్వహణ,  పర్యావరణం, ఫిషరీస్, అడవి జంతువులు, టూరిజం మేనేజ్ మెంట్ వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు.

వివిధ దేశాలలో ఉన్న పరిశోధనా కేంద్రాలు, ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ తదితర అంశాలను  వివరించారు.వ్యవసాయంలో సాధించవలసిన అంశాలు, ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో  న్యూ మెక్సికో స్టేట్ యునివర్సిటీ వైస్ ప్రసిడెంట్, గ్రాడ్యుయేషన్ స్కూల్ డీన్  లూయిస్ సిఫాన్ టెస్, ఇంజనీరింగ్ విభాగం డీన్ లక్ష్మి ఎన్ రెడ్డి,  వ్యవసాయ విభాగం డీన్ రోలాండో ఫ్లారోస్,  కాలేజీ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ లారెన్ సిఫుటెస్, ఇండియన్ కో ఆర్డినేటర్ కుమార్ అన్నవరపు,  ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్.వి.నాయుడు, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ జె.దిలీప్ బాబు,  వ్యవసాయ విభాగం డీన్ డాక్టర్ జె.కృష్ణ ప్రసాద్ జీ, విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు, డిప్యూటీ డైరెక్టర్ ధర్మజ, వ్యవసాయ శాఖ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్.డి.ఆర్.కె.శర్మ తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు వచ్చిన న్యూ మెక్సికో స్టేట్ యునివర్సిటీ ప్రతినిధులు ఈ నెల 31న బాపట్లలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శిస్తారు. ఇక్కడ విశ్వవిద్యాలయాలలో విద్య, పరిశోధన, విస్తరణ, రాష్ట్రంలో పండే పంటలు, అనుసరించే ఆధునిక టెక్నాలజీ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించిన తరువాత వారు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

Related Posts