నగరంలో బోగస్ ఓట్ల గురించి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి వాటిని తొలగించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలియజేశారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు, పోలీస్ నోడల్ అధికారులు హాజరైన ఈ సమావేశంలో దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల తొలిదశ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని తెలియజేశారు. నగరంలోని ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్ల గురించి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై క్షుణ్ణంగా తనిఖీచేసి తొలగించామని, ఈ విషయంలో కొన్ని కోర్టు కేసులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల నామినేషన్ ప్రారంభమయ్యే వరకు కొత్తగా ఓటర్లను నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బంది కేటాయింపుకు సంబంధించి వివిధ శాఖల నుండి ఉద్యోగులు, అధికారుల వివరాలను సేకరించడం జరిగిందని దానకిషోర్ పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహన పెంపొందించడానికి 92 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు.
ఈ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించే సామాగ్రికి రేట్లను నిర్థారణ చేసే విషయంలో అన్ని పార్టీలు అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలియజేశారు. హైదరాబాద్‌లో 3,826 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 40 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి సభలు, సమావేశాలు, పాదయాత్రలకు తప్పనిసరిగా ఇ-సువిధ ఆన్‌లైన్ ద్వారానే అనుమతులను పొందాలని స్పష్టం చేశారు. అనుమతులకు దరఖాస్తు చేసిన 48 గంటల్లోగా అనుమతి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ 24గంటల్లోనే ఇవ్వాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశామని దానకిషోర్ తెలిపారు.
స్థానిక ప్రజలకు ఇబ్బందులులేకుండా, శాంతి భద్రతల పరిస్థితులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని సభలు, సమావేశాలకు అనుమతులు జారీచేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రతిఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఉల్లంఘనలు, అక్రమాలను సి-విజిల్ అనే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఈ సి-విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కరించే బాధ్యతలను జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గ స్థాయిలో సి-విజిల్ ఫిర్యాదుల నోడల్ అధికారులను నియమించాలని కోరామని తెలిపారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో 53శాతం కన్నా తక్కువగా ఓటింగ్ నమోదు అయ్యిందని, ఇంత తక్కువ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం బాదకరమైన విషయమని దానకిషోర్ పేర్కొన్నారు.