బెజవాడలో ఇద్దరు నాయకులు. వారు ఇద్దరూ నిత్యం కక్ష కార్పణ్యాలతో రగిలిపోయేవారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని నిత్యం `పోరు` చేసుకునే వారు. కానీ, పేదలు, బడుగుల విషయానికి వస్తే.. వారు కరిగిపోయేవారు. నిత్యం పేదల కోసం వారి ఇళ్లు 24 గంటలూ తెరిచే ఉండేవి. అలా మెలిగిన ఇద్దరు నాయకులు బెజవాడ సింహాలుగా ప్రతీతి చెందారు. ప్రస్తుతం వారు లేరు. అయినా కూడా వారి పేరు మాత్రం బెజవాడ చరిత్రపై శాశ్వతం. అయితే, వారి అడుగు జాడలే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి. కక్ష, కార్పణ్యాల విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడితే.. పేదల పట్ల ఆ ఇద్దరు నాయకులు చూపించిన ఔదార్యం అంతా ఇంతా కాదు. “అక్కడికి వెళ్తే.. మా సమస్యకు చిటికెలో పరిష్కారం“- అనుకునే రేంజ్‌లో ఆ ఇద్దరు నాయకులు ప్రజలకు అండగా నిలిచేవారు.వారే ఒకరు వంగవీటి రంగా, మరొకరు దేవినేని నెహ్రూ.. ఉరఫ్ దేవినేని రాజశేఖర్. ఇప్పుడు ఆ ఇద్దరు లేరు. విజయవాడను రెండుగా చేసుకుని దాదాపు రెండున్న దశాబ్దాలకు పైగా ఈ ఇద్దరు నాయకులు హవా చలాయించారు. సరే! మారు తున్న పరిస్థితులకు అనుగుణంగా కక్ష, కార్పణ్యాలను పక్కన పెడితే.. పేదలకు అండగా ఉండే విధానంలోనూ వారే కీలకం. మాకీ కష్టం వచ్చిందని ఎవరైనా ఈ నాయకుల ఇంటికి వెళ్తే.,. దానిని పరిష్కరించాక బాధితులను తిరిగి ఇంటికి పం పేవారు. ఆ సమస్య వ్యక్తిగతం కావొచ్చు. ప్రభుత్వ అధికారులతో కూడినది కావొచ్చు. ఇంకోటేదైనా సరే.. బాధితుల కోసం ఈ ఇద్దరి నాయకుల ఇళ్లకు తలుపులు లేకుండా పోయాయి. ఇక, ఈ ఇద్దరు నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. అంతేకాదు, ఇద్దరిలోనూ కలిసి ఉన్న ఏకైక లక్షణం.. పెద్దగా మాట్లాడరు. పనిచేయడమే!అంతేకాదు, నమ్ముకున్న పార్టీని నెత్తిన పెట్టుకున్నారు. వారు తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. ఇక, వారికి తిరు గే లేకుండా పోయేది. అందుకే ఇప్పటికీ బెజవాడలో ఈ ఇద్దరు నాయకులను దేవుళ్లతో సమానంగా ఇళ్లలో ఫొటోలు పె ట్టుకున్నవారు ఉన్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు వారి వారసులు రంగంలో ఉన్నారు. మరి ఆ వారసత్వాన్ని నిలబెడుతు న్నారా? అంటే.. నేతిబీరలో నెయ్యి లాగానే పరిస్థితి మారిందని అంటున్నారు రంగా, నెహ్రూ కాలం నాటి నాయకులు. ఇక, ఇప్పుడు వారి వారసులుగా రంగంలోకి దిగిన వారు రాధా, అవినాష్‌లు తండ్రులతో పోలిస్తే పెద్దగా ప్రజల్లో కలవడం లేదు. పైగా వీరి వద్దకు వచ్చే వారు కూడా తగ్గిపోయారు. ఇంకోటేంటే.. పార్టీల్లో ఉన్నా.. అధినేతల వద్ద వీరికి పెద్దగా పట్టులేకపోవడం మరో మైనస్‌గా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో బెజవాడలో సింహాల అడుగు జాడలు కనుమరుగు అయ్యాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇక వంగవీటి వారసుడు రాధా గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలో ఉన్నా కోరుకున్న సీటు దక్కని పరిస్థితి. ఇక దేవినేని వారసుడు అవినాష్‌కు తండ్రి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తే వేరుగా ఉండేది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అవినాష్‌కు సీటు వస్తుందా ? లేదా ? పార్టీ క్లిష్టమైన సీటు ఇస్తుందా ? అన్నది కూడా చూడాలి. ఏదేమైనా తండ్రుల రేంజ్‌ను అందుకోలేకపోతోన్న ఈ ఇద్దరు వారసులు దీనిని గమనించి ప్రజల్లోకి ఇప్పటికైనా వస్తారో? లేక ఇల్లే బాగుంది.. అనుకుంటారో చూడాలి..!