విజయవాడ నగరం నడిబొడ్డున ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెంజి సర్కిల్ పైవంతెన నిర్మాణంలోని ఒక వైపు ఫ్లై ఓవర్, కీలక దశ దాటింది. అయితే రెండో వరుస మాత్రం, ఇప్పటి వరకు కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు అభ్యర్ధన పంపినా, కేంద్రం పక్కన పడేస్తూ వస్తుంది. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పరిస్థితి వివరించి, రెండో వైపు నిర్మాణం గురించి, దాని జాప్యం గురించి, వివరించారు. దీంతో గడ్కరీ సానుకూలంగా స్పందించారు. త్వరలో నగరంలోని బెంజ్ సర్కిల్‌వద్ద రెండో ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు టెండర్లు పిలవాలని జాతీయ రహదారుల సంస్థ... టెక్నికల్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.
త్వరగా టెండర్లు పిలవాలని గడ్కరీని టీడీపీ ఎంపీ కేశినేని నాని కోరారు. దీంతో ఆయన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలు మాత్రం వెంటనే వస్తున్నాయి, మరి డబ్బులు ఇస్తారో ఇవ్వరో చూడాలి.బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ మొదటి దశ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 1450 మీటర్ల దూరం పైవంతెనలో 49 పిల్లర్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గడ్డర్ల నిర్మాణం జరుగుతోంది. సాధారణ ఆకృతుల ప్రకారం పిల్లర్ల మధ్య నిడివి సుమారు 30 మీటర్లు ఉండాల్సి ఉంది.
సాధారణ పిల్లర్ల నిర్మాణం ఆ విధంగా చేశారు. కానీ బెంజి సర్కిల్ జంక్షన్ వద్ద 30 మీటర్ల నిడివి సరిపోవడంలేదు. దీంతో దీని ఆకృతులు ఇక్కడ మార్చారు. 9, 10 పిల్లర్ల మద్య దూరం 42 మీటర్లు ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల పునాదులు ప్రారంభం అయ్యాయి. రెండు పిల్లర్ల మధ్య దూరం 42 మీటర్లు ఉండటం వల్ల వాహనాలు తిరిగే అవకాశం ఉంది. ఎంజీ రోడ్డు నుంచి నేరుగా బందరు రహదారికి, చెన్నై నుంచి వచ్చే వాహనాలు బందరు రహదారికి మళ్లాల్సి ఉంటుంది.
దీంతో రెండు పిల్లర్ల మధ్య దూరంపెంచారు. దీంతో స్పాన్ల దూరం కూడా పెరగనుంది.బెంజి సర్కిల్ తరహాలోనే నిర్మాలా కాన్వెంట్, రమేష్ ఆసుపత్రి వద్ద పిల్లర్ల మధ్య దూరం పెంచాల్సి ఉంది. సాధారణంగా ఎక్కడైనా పిల్లర్ల మధ్య సమాన దూరం ఉంటుంది. కానీ ఈ వంతెనకు మాత్రం మూడు ప్రాంతాల్లో వ్యత్యాసం ఉంది. మొత్తం 240 గడ్డర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 100గడ్డర్లను ఏర్పాటు చేశారు. రాత్రిపూట ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంకిపాడు సమీపంలో ఫ్యాబ్రికేటెడ్ పనులు చేస్తున్నారు. స్పాన్లు, గడ్డర్లను అక్కడ నిర్మాణం చేసి భారీ వాహనాలు, క్రేన్లతో వాటిని తరలించి నిర్మాణం చేస్తున్నారు. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పనుల పురోగతి 65 శాతం మేర ఉంది. ముప్పేట సమాంతరంగా పనులు ప్రారంభించటం వల్ల త్వరగా పూర్తవుతాయని అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిథులు చెబుతున్నారు