పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఆక్వా రాజధానిగా… కేపిటల్ ఆఫ్ క్షత్రియ కమ్యూనిటి టౌన్‌గా గుర్తింపు పొందింది భీమవరం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్షత్రియ కమ్యూనిటీకి కీలక పట్టణంగా గుర్తింపు పొందిన భీమవరం ఆక్వా ఉత్పత్తులతో మంచి గుర్తింపు పొందింది. నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం రూరల్, వీరవాసరం మండలాలు విస్తరించి ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నియోజకవర్గంలో పూర్తిగా రాజుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది.
పునర్విభజన తర్వాత భీమవరం నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్న పాలకోడేరు మండలాన్ని ఉండి నియోజకవర్గంలో కలిపి పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న వీరవాసరం మండలాన్ని భీమవరం నియోజకవర్గంలో చేర్చడంతో కాపుల హవా ప్రారంభం అయ్యింది.వీరవాసరం మండలంలో కాపు జనాభా, కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో భీమవరం నియోజకవర్గం గెలుపు, ఓటమిలు, అభ్యర్థులు ఎంపికలో ఇప్పుడు ఆ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే పీవీ. నరసింహరాజు భీమవరం నుంచి నాలుగు సార్లు విజయం సాధించగా ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సైతం గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్నారు.
1983, 85లో పీవీ. నరసింహరాజు, 1989లో కాంగ్రెస్ నుంచి అల్తూరి సుభాష్‌చంద్రబోస్ గెలుపొందారు. తిరిగి 1994, 99 ఎన్నికల్లో టీడీపీ నుంచి మరో సారి పీవీ. నరసింహరాజు రెండు సార్లు గెలిచి నియోజకవర్గం చరిత్రలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2004లో ఇక్కడ నుంచి పోటీ చేసిన కాపు సామాజికవర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ గెలుపొందారు.నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో భీమవరం స్వరూపం మారగా కాంగ్రెస్ నుంచి తొలిసారి పోటీ చేసిన పులపర్తి అంజిబాబు గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీలోకి జంప్ చేసి మరో సారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇప్పటి వరకు చూస్తే క్షత్రియ సామాజికవర్గం వారు ఈ నియోజకవర్గాన్ని శాసించినా.. పునర్విభజన తర్వాత మారిన స్వరూపంతో కాపుల హవా కొనసాగుతోంది. 2004 నుంచి గత మూడు ఎన్నికల్లోనూ ఈ సామాజికవర్గానికి చెందిన వారే విజయం సాధిస్తున్నారు. ఏదేమైనా భీమవరం నియజకవర్గంలో క్షత్రియ వర్సెస్ కాపుల మధ్య రాజకీయ సంగ్రామం హోరాహోరీగా ఉంటుంది. నియోజకవర్గంలో గత నాలుగున్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టినట్టు లేరు. వ్యక్తిగతంగా సౌమ్యుడు, వివాద రహితుడు అన్న పేరున్నా అభివృద్ధి విషయంలో ఆయన పెద్దగా చొరవ చూపరన్న అపవాదు ఆయనపై ఉంది.వాస్తవంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ఐదేళ్లలోనే ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. గత ఎన్నికలకు ముందే అంజిబాబు ఓడిపోతారని అందరూ అనుకున్నా అనూహ్యంగా ఆయన చివరి క్షణంలో టీడీపీలోకి జంప్ చేసి జిల్లాలో టీడీపీ వేవ్ ఉన్న నేపథ్యంలో ఆయన సులువుగా విజయం సాధించారు
రెండో సారి గెలిచిన అంజిబాబు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటారన్న పేరున్నా అభివృద్ధి విషయంలోనూ ఆయన ఐదారు అడుగులు వెనకే ఉంటారన్న అపఖ్యాతి మూటకట్టుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తే అంజిబాబుకు వచ్చే ఎన్నికల్లో ఎదురు గాలులు తప్పవని అంటున్నారు. అయితే ఆయనే టీడీపీ నుంచి మరో సారి పోటీలో ఉంటారా ? లేదా ఆయన పార్టీ మారతా రా?
వచ్చే ఎన్నికల్లో భీమవరం టీడీపీ అభ్యర్థి ఎవరు అవుతారు అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.అంజిబాబు వియ్యంకుడు మంత్రి గంటా శ్రీనివసరావు కావడంతో ఆయన రాజకీయ దారిని బట్టే అంజిబాబు కూడా అదే రూట్‌లో వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.
గంటా టీడీపీలో ఉన్నా అంజిబాబుకు టీడీపీ టిక్కెట్ వస్తుందా ? రాదా అన్నది సందేహమే. జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ తన తనయుడు తోట జగదీష్‌కు భీమవరం టీడీపీ సీటు ఇప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మరో ఒకరిద్దరు బలమైన నేతలు సైతం భీమవరం టీడీపీ టిక్కెట్‌పై కన్నేసారు.
ఒకవేళ అంజిబాబు పార్టీ మారాల్సి వస్తే జనసేన కూడా ఆయనకు ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ 2004లో గెలిచి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్‌కు టిక్కెట్ ఖరారు అయ్యింది. ఇటీవల పాదయాత్రకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ సైతం భీమవరం నుంచి వచ్చే ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తారని బహిరంగంగా ప్రకటించడంతో శ్రీనివాస్‌కు లైన్ క్లియర్ అయ్యినట్టే అంటున్నారు.అంజిబాబుతో పోలిస్తే శ్రీనివాస్ దూకుడుగా ఉంటారన్న పేరు ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు కూడా ఆయనకు ప్లస్ కానున్నాయి.
అయితే ఓ ప్రధాన సామాజికవర్గంతో ఆయనకు ఉన్న తీవ్రమైన వైరుధ్యం నేపథ్యంతో పాటు జనసేన పార్టీ గ్రంధి గెలుపు, ఓటమిలను శాశించే పరిస్థితి ఏర్పడింది. ఇక నియోజకవర్గంలో పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం బలంగా ఉండడంతో జనసేన సైతం ప్రధాన పోటీ దారుగా ఉంది. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వేగ్నేశ కనకరాజు సూరి రెండో స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం.
వచ్చే ఎన్నికల్లోనూ భీమవరంలో జనసేన గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. ఈ ఫైట్‌లో ఎవరు గెలిచినా ఓడిన ఇద్దరూ ఎవరో ఒకరి గెలుపు, ఓటమిలకు గండి కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.