మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యనాయుడును పార్టీలో చేర్చుకుని ఆత్మకూరు టిడిపి అభ్యర్థిగా ప్రకటించి వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డిని వణికిస్తుండగా...ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మాజీ ఎమ్మెల్యే సుందరరామిరెడ్డి కుమారుడు జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి టిడిపిలో చేర్పించేందుకు రంగం సిద్ధమైంది.
వారితో మంతనాలు జరిపి, వారి రాజకీయ భవిష్యత్‌పై నమ్మకం కల్గించినా మున్సిపల్ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డిలు వారిద్దరినీ రెచ్చగొడుతూ వారిని పార్టీలో చేరకుండా నిరోధించినట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా మీరు 'చంద్రబాబు' ఏ పోస్టు ఇస్తారో..హామీ తీసుకోండి...అప్పటి వరకు పార్టీలో చేరేందుకు సిద్ధం కాకండి..అని మంత్రులిద్దరూ రెచ్చగొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు ఫిర్యాదు చేయడం వివాదస్పదమౌతోంది.
జెడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి..భేషరతుగా టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు..కృష్ణయ్య, కొమ్మిలు 'చంద్రబాబు'కు సన్నిహితులే. భవిష్యత్‌లో 'కొమ్మి'కి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, అదే విధంగా జెడ్‌పి ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డికి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా వారిద్దరూ మంత్రులు నారాయణ, సోమిరెడ్డిల మాటలు విని పరిపూర్ణమైన హామీ ఇస్తేనే పార్టీలో చేరతామని చెబుతున్నారట.
నిన్న కాక మొన్న నాయకుల మధ్య సయోధ్య ఏర్పాటు చేస్తే...ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ షరతులు పెట్టడం ఏమిటి.? ఇందులో ఏదో మర్మం దాగుందని పార్టీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయబోతున్నారు. ఒకవైపు ఆత్మకూరులో పోటీ చేస్తే గెలవడం కష్టమని భావిస్తున్న నేపథ్యంలో కృష్ణయ్యను పార్టీలో చేర్చి అభ్యర్థిగా ప్రకటించడం మాజీ ఎమ్మెల్యే 'కొమ్మి'ని పార్టీలో చేర్పించేందుకురంగం సిద్ధం చేయడంతో వైకాపా కన్నా టిడిపినే బలపడిందనేఅభిప్రాయం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రులు ఈ విధమైన పుల్ల పెట్టడంపైపార్టీ నాయకుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంఅవుతోంది.మాజీ ఎమ్మెల్యే 'కొమ్మి' కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ తతంగాన్ని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆత్మకూరు టిడిపి అభ్యర్థి 'బొల్లినేని'లు నడిపిస్తుండగా...వారు ఎక్కడ చంద్రబాబు దగ్గర మార్కులు పొందుతారో..అన్న ఆలోచనతో మంత్రులు వారిద్దరినీ రెచ్చగొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి తండ్రి అయిన సుందరరామిరెడ్డి 1985,1989లో విజయంసాధించిన విషయం విదితమే. ఈ నియోజకవర్గంలో ఆ కుటుంబానికి పూర్తి పట్టుఉంది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే 'కొమ్మి' 1994లో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించి 1999లో స్వల్ప తేడాతో ఓడిపోయినా 2004లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి..త్రిముఖ పోటీలో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2009లో ఆయన టిడిపి అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి ఓడిపోయి 2014లో వైకాపాలో చేరి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 'కొమ్మి' వైసీపీలో చేరకుండా టిడిపిలోనే కొనసాగి ఉంటే..2014లో ఆయనే ఆత్మకూరు నుంచి పోటీ చేసి విజయం సాధించేవారే. ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆత్మకూరు టిడిపి అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యనాయుడు, కొమ్మి లక్ష్మయ్యనాయుడులు సన్నిహితులు.
తరువాత వారిద్దరి మధ్య ఎక్కడ బెడిసికొట్టిందో కానీ..1989లో 'కొమ్మి' కాంగ్రెస్‌లో చేరి 'బొల్లినేని'ని ఓడించారు. అప్పట్లో ప్రారంభమైన విభేదాలు 2004లో టిడిపి పొత్తుతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన 'కృష్ణమనాయుడు' ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన 'కొమ్మి'పై ఓడిపోయి..వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఒకప్పుడు సన్నిహితులైన వారిద్దరూ రాజకీయంగా విభేదించి..అన్ని విధాలుగా దెబ్బతిన్న వారిద్దరినీ ఒకే గూటికి తెచ్చి..మంతనాలు చేసి..సయోధ్య ఏర్పాటు చేసి..పార్టీ నేత 'చంద్రబాబు' దృష్టికి తీసుకెళ్లిన ఘనత మాజీ మంత్రి ఆదాలకు దక్కింది.
మరి కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. కొమ్మినేని,రాఘవేంద్రరెడ్డిలు గొంతెమ్మ కోర్కెలు కోరకపోయినా..వారికి హామీలు ఇవ్వడం ఖాయం, వారిద్దరూ పార్టీలో చేరడం ఖాయం, ఆత్మకూరు నియోజకవర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో బలం పుంజుకోవడం ఖాయమని స్థానిక నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.