YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఉద్యోగార్థులకు శుభవార్త..

 ఉద్యోగార్థులకు శుభవార్త..

- రైల్వేలో భారీ రిక్రూట్‌మెంట్.. 

-  62,907 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

- శనివారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

మొన్నటికి మొన్న 26,502 టెక్నీషియన్, అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన రైల్వే.. తాజాగా మరో 62,907 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తద్వారా వేయి కళ్లతో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు శుభవార్తనిచ్చింది. గ్రూప్ డీ పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియను ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ప్రాంతీయ రైల్వే రిక్రూట్‌‌మెంట్ బోర్డులు ‘సీఈఎన్ 02/2018’ పేరిట తమ అధికారిక వెబ్‌సైట్లలో నోటిఫికేషన్‌ను జారీ చేశాయి. శనివారం నుంచే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. ఐటీఐ/తత్సమాన అర్హత, పదో తరగతి చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 12 లోపు రైల్వే అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడో కేంద్ర వేతన సంఘం ప్రకారం నెలకు కనీస వేతనం రూ.18 వేలు. 

దరఖాస్తు చేయడమెలా..
రైల్వే అధికారిక వెబ్‌సైట్ HTTP://WWW.INDIANRAILWAYS.GOV.IN లోకి వెళ్లి.. రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌ను క్లిక్ చేసి సంబంధింత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ- సికింద్రాబాద్ అయితే.. సికింద్రాబాద్.. లేదా ఇతర ఆర్ఆర్‌బీలు)ను ఎంపిక చేసుకోవాలి. అందులోకి వెళ్లాక సీఈఎన్ 02/2018 నోటిఫికేషన్‌లోకి వెళ్లి.. రిజిస్టర్ అయ్యి దరఖాస్తును పూర్తి చేయాలి.

దరఖాస్తు ఫీజు..
జనరల్ కేటగిరీ (అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ) అభ్యర్థులు: 500 రూపాయలు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలు/ఆర్థికంగా వెనకబడినకులాలు (ఈబీసీ)/ఎక్స్ సర్వీస్‌మన్: 250 రూపాయలు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ద్వారా ముందు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో ఎంపికైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. 

ఏయే ఆర్ఆర్‌బీలు...
సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహాటీ, కోల్‌కతా, ముంబై, పట్నా, రాంచి

పోస్టుల వివరాలు...
ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎస్ అండ్ టీ, మెడికల్, ట్రాఫిక్ విభాగాల్లో గ్రూప్ డీ కేటగిరీ కింద పోస్టులను రైల్వే భర్తీ చేస్తోంది. క్యాబిన్ మాన్, ట్రాక్‌మాన్, లివర్‌మాన్, పాయింట్స్‌మాన్, హెల్పర్-II, జీఆర్.D(స్టోర్), కీమాన్, షంటర్, వెల్డర్, ఫిట్టర్, పోర్టర్, హెల్పర్-II (మెకానిక్), హెల్పర్-II (ఎస్టీ), జీఆర్.D (ఇంజనీరింగ్), గ్యాంగ్‌మాన్, స్విచ్‌మాన్ వంటి 16 రకాల పోస్టులను భర్తీ చేయనుంది. 

విద్యార్హతలు..
పదో తరగతి లేదా ఎన్సీవీటీ/ఎస్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ లేదా తత్సమాన అర్హత లేదా ఎన్సీవీటీ ఇచ్చిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (ఎన్ఏసీ) కలిగి ఉండాలి. 
వయసు 2018 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు వయో సడలింపు ఉంటుంది. 

జీతభత్యాలు..
సీబీటీ, దేహదారుఢ్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఏడో కేంద్ర వేతన సంఘం లెవెల్-1 ప్రకారం నెలకు రూ.18 వేలు+ఇతర భత్యాలను అందజేస్తారు. 

Related Posts