తెలంగాణలో అంతంత మాత్రంగా ఉంది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. అందుకోసమే త్వరలో జరగబోయే ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బీజేపీ.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల అన్ని స్థానాల్లో పోటీ చేయలేకపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుండడంతో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. ఒకవైపు జనాకర్షకమైన మేనిఫెస్టోను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న ఆ పార్టీ అధిష్ఠానం.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించేసింది. ఎన్నికల కోసం సినీ గ్లామర్‌ను కూడా వాడుకోవాలని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ సినీ నటికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమెకు పార్లమెంట్ స్థానం ఇవ్వాలనుకున్నా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీకే పంపాలని డిసైడ్ అయ్యారట తెలంగాణ బీజేపీ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉద్యోగి హరిదాస్ రాథోడ్-రాధాబాయి కుమార్తె అయిన సినీనటి రేష్మారాథోడ్ కొద్ది నెలలుగా బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సినీ గ్లామర్‌తో తనకు పార్టీ అవకాశమిస్తే ఎక్కడనుంచైనా పోటీకి సిద్ధమని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన రెష్మా.. తన జిల్లా అయిన ఖమ్మంలోని వైరా నియోజకవర్గం నుంచి అసెంబ్లీపై కన్నేసింది.గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ స్థానాన్ని బీజేపీ వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేని కారణంగానే రెష్మా ఈ స్థానాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. వైరా నియోజకవర్గం నుంచి కాకుండా బీజీపీ అధిష్ఠానం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు వైరా లేదా ఇల్లందు నియోజవర్గాలను కేటాయించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, భద్రాచలం, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక రెండో జాబితాలో ఈమె పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. సినీ తార పైగా ఈ ప్రాంత వాసులతో సంబంధబాంధవ్యాలుండటం, గిరిజన యువతి కావడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.