తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చెప్పలేని పరస్థితి. ప్రస్తుతం తమిళనాట అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలుపొందడం సాధ్యమేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలే మద్రాస్ హైకోర్టు తీర్పుతో తమిళనాడులో 18 మంది అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడిన సంగతి తెలిసిందే. వీటికి త్వరలోనే ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ కూడా భావిస్తోంది. ఈ 18 నియోజకవర్గంాలతో పాటు కరుణానిధి, ఎ.కె.బోస్ మరణంతో తిరువారూర్, తిరప్పరకుండ్రం లకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అంటే 20 అసంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండటంతో తమిళగాట పొలిటికల్ వేడి పెరిగింది.అధికార అన్నాడీఎంకే ఈ 18 స్థానాలకు అభ్యర్థులను అన్వేషిించే పనిలో పడింది. అంతేకాకుండా పార్టీని థిక్కరిస్తే తాము అనర్హత వేటు వేస్తామని సంకేతాలు పంపుతోంది. దినకరన్ వర్గానికి దగ్గరగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉంది. ఈ మేరకు స్పీకర్ ఇప్పటికే వీరికి నోటీసులు పంపారు.వీరిని విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కలై సెల్వన్, ప్రభు, రత్న సభాపతికి నోటీసులు ఇప్పటికే అందాయి. ఇక మరో ఎమ్మెల్యే కరుణాన్ ను కూడా అన్నాడీఎంకే టార్గెట్ చేసింది. నటుడు కావడంతో ఇప్పటి వరకూ నోటీసులు పంపకపోయినా త్వరోలోనే కరుణాన్ కు కూడా ఈ జాబితాలో చేర్చనుంది.మరో నలుగురిపై వేటు వేయడం ద్వారా దినకరన్ వర్గంలోకి వెళితే వేటు తప్పదన్న సంకేతాలను పంపనుంది. ఈ నేపథ్యంలో దినకరన్ కూడా అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వీరందరితో ప్రత్యేకంగా సమావేశమైన దినకరన్ వారికి పూర్తి స్థాయి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. అర్థ, అంగబలాలతో తాను ఆదుకుంటానని దినకరన్ వీరికి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిపై సానుభూతితో పాటు, పళనిస్వామి, పన్నీర సెల్వంలపై వ్యతిరేకత తనకు కలసి వస్తుందని దినకరన్ విశ్వసిస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తో కూడా లోపాయి కారీ ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.మరోవైపు ఇటీవల కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ సయితం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. కమల్ హాసన్ ఇటీవలే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. కమల్ ఎక్కువ యువతతో సమావేశాలు పెడుతూ యూత్ ను ఆకర్షించే దిశగా ముందుకు వెళుతున్నారు. అయితే ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని కమల్ చెప్పడంతో ఇటు అన్నాడీఎంకే, డీఎంకే, దినకరన్ పార్టీలు అయోమయంలో పడ్డాయి. కమల్ పోటీ ఎవరికి నష్టమన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తం మీద ఉప ఎన్నికలు తమిళనాట రాజకీయ మార్పులకు కారణమవుతాయన్నది విశ్లేషకుల అంచనా.