కర్టాటకలో జరుగుతున్నవి ఐదు ఉప ఎన్నికలయినా అవి రెండు ప్రధాన పార్టీలకూ పంచ ప్రాణాలని చెప్పొచ్చు. ఉప ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారిపై విశ్వాసం పెరుగుతుందనేది వాస్తవం. ఇప్పటికే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. సంకీర్ణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఎక్కువగా ఉండటం, ఎప్పటికప్పుడు హైకమాండ్ జోక్యం చేసుకుంటుండటంతో కొంత ప్రభుత్వం ఇన్నాళ్లూ మనుగడ సాగిస్తోందనే చెప్పాలి. అయితే ఈ ఐదు ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత జాతకాలు మారతాయన్నది విశ్లేషకుల అంచనా.సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీలో 20 మంది వరకూ అసమ్మతి ఎమ్మెల్యేలున్నారు. ఎన్నికల ముందు వరకూ వీరంతా ఆపరేషన్ కమల వలలో పడ్డారన్న ప్రచారం జరిగింది. ఈలోపు మంత్రి వర్గ విస్తరణను తెరపైకి తెచ్చారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వరకూ మంత్రి వర్గ విస్తరణను తెలివిగా పార్టీ అధిష్టానం నాన్చింది. ఆరు మంత్రి పదవుల కోసం 20 మంది పోటీ పడుతుండటంతో హైకమాండ్ కూడా కొంత ఆలోచనలో పడింది. మంత్రి వర్గంలో చోటు దక్కని వారికి నామినేెటెడ్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈలోపు ఉప ఎన్నికలు రానే వచ్చాయి. దీంతో విస్తరణ ఎప్పటిలాగే మరోసారి వాయిదా పడింది.అయితే విస్తరణ జరపలేదని అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలందరికీ పరీక్ష పెట్టింది అధిష్టానం. ఒక్కొక్కరికీ బాధ్యతలను అప్పగించింది. శివమొగ్గ, బళ్లారి, మాండ్య పార్లమెంటు స్థానాలకు, జమఖండి, రామనగర అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రెండు స్థానాల్లోనూ, కుమరస్వామి పార్టీ జనతాదళ్ ఎస్ మూడు స్థానాల్లో పోటీ చేయడం కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. దీంతో స్థానికంగా అసంతృప్తిని నేతలు బాహాటంగానే వెళ్లగక్కారు. మరోవైపు కుమారస్వామి భార్య అనిత పోటీ చేస్తున్న రామనగర స్థానంలోకూడా కాంగ్రెస్ శ్రేణులు అనితకు అండగా నిలుస్తాయన్న నమ్మకం లేదు. భారతీయ జనతా పార్టీ ఆశలు పెంచుకుంది. బీజేపీ ఉప ఎన్నికలు జరిగే ఐదు స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. ఈ ఐదు స్థానాల్లో కనీసం మూడింటిలో గెలిస్తే తమపై నమ్మకం పెరుగుతుందని యడ్యూరప్ప భావిస్తున్నారు. ఆ నమ్మకమే అసంతృప్తి వాదులను తమవైపు మళ్లిస్తుందని, ప్రభుత్వ ఏర్పాటు సులువవుతుందని బీజేపీ గట్టిగా నమ్ముతుంది. అందుకోసమే మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామిలు ఈ ఉప ఎన్నికలలో చెమటోడుస్తున్నారు. ఉప ఎన్నికలు కొంపముంచేలా ఉన్నాయని భావించిన వీరు అసంతృప్త నేతలను బుజ్జగించే యత్నంలో పడ్డారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.