రాష్ట్రంలో జరిగిన అత్యంత ఆసక్తికర పరిణామం.. వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం…! నిజానికి ఈ ఘటన క్షణాల వ్యవధిలోనే సంచలనం సృష్టించినా.. దీనిని హైప్ చేసి జాతీయ స్థాయిలో దీని కి గుర్తింపు తెచ్చింది ఎవరనే విషయం మాత్రం ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఈ విషయంలో నిజానికి నష్టపో యింది వైసీపీ. కత్తి దాడి జరిగింది ఆ పార్టీ అధినేత జగన్‌పై. కాబట్టి ఈ విషయాన్ని యాగీ చేసి, రచ్చ రచ్చ చేయాల్సిన బాధ్యత, అవసరం రెండూ కూడా ఆపార్టీకే ఉన్నాయి. ఉంటాయి. కానీ, జగన్ మాత్రం ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఈ విషయం మళ్లీ తెరమీదికి వచ్చింది. ఎక్కడా లేని హైప్ వచ్చింది. ముఖ్యంగాఒక విపక్ష నాయకుడిపై కత్తితో జరిగిన దాడిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకు నేందుకు చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు, తిరిగి ఇది ఆయన మెడకే చుట్టుకుంది. ఇక, దీనికితోడు టీడీపీ మంత్రులు చేసిన అత్యుత్సాహపు ప్రకటనలు, జగన్ పై చేసిన విమర్శలతో దాడి ఘటనపై చర్చ మొదలైంది. విశాఖ విమానాశ్రయం లోపల జరిగింది కాబట్టి తమకు సంబంధం లేదని తాజాగా కూడా టీడీపీ మంత్రులు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే నిజమైతే.. ప్రత్యేక హోదా ఉద్యమ కాలంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జగన్‌ను ఏపీ పోలీసులు ఎలా నిలువరించారని ప్రశ్నిస్తున్నారు. ఆయనను కనీసం రోడ్డు మీదకు కూడా రానివ్వలేదని దీనికి ఎందుకు కారణమని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన సైలెంట్‌గా విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. నిజానికి ఆయన విశాఖలోనే ఉండి.. ఆస్పత్రిలో చేరి ఉంటే.. పరిణామాలు తీవ్రంగా ఉండేవి. కానీ, ఆయన ఏమనుకున్నారో ఏమో.. మౌనం గానే వెళ్లిపోయారు. అంతేకాదు, అంతే వినయంగా ఓ ట్వీట్ కూడా చేశారు. తనకు ఏమీ కాలేదని, పార్టీ నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని, తను ఇలాంటి పిల్ల వ్యవహారాలను పట్టించుకోనని చెప్పారు. అంతేకాదు, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు తాను సిద్ధమని ప్రకటించడంద్వారా కూడా ఆయన తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇంత వరకు చాలాబాగానే ఉంది. దాదాపు ఈ విషయాన్ని కూడా ప్రజలు లైట్ తీసుకున్నారు.వైసీపీ నేతలు జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని కేంద్రం పెద్దలకు వివరించారు. జగన్ కు భద్రత పెంచాలనికోరారు. ఈ సంఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆపరేషన్ గరుడ పేరుతో టీడీపీ ఆడుతున్న నాటకాన్ని బట్టబయలు చేయాలనికేంద్రాన్ని కోరుతుండటం విశేషం. సినీనటుడు శివాజీ చెప్పిన దాన్నిపట్టుకుని ఆపరేషన్ గరుడ అంటూ ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మరి కేంద్రం విచారణ చేపడితే శివాజీ బుక్కవ్వాల్సిందేనంటున్నారు. ఇలా మొత్తానికి జగన్ ఎపిసోడ్‌ను రాజకీయంగా పెద్దది చేసింది టీడీపీనేనని అంటున్నారు విశ్లేషకులు.