తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. అయితే, నిర్ణీత సమయానికంటే ముందే అసెంబ్లీని రద్దు చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పాటు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి తెలంగాణలో అన్ని పార్టీలు తెగ హడావిడి చేసేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మిగతా పార్టీలకు సవాల్ విసిరారు. అప్పుడు పార్టీలో అసంతృప్తి, అసమ్మతి చెలరేగిన విషయం కూడా తెలిసిందే. ప్రతిపక్షాలకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకూడదని భావించిన గులాబీ బాస్.. ప్రచారాన్ని కూడా వేగవంతం చేశారు. ఒకవైపు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో తిరుగుతుండగానే.. కేసీఆర్ పలు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.
ఈ సభల్లో ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడారు. ఇప్పుడిదే టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. అప్పటి సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. సీమాంధ్రులను ఉద్దేశించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సీమాంధ్రులు తమకు దూరమైపోతారని భావించిన ఆ పార్టీలోని కొందరు నేతలు తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారట. ఇందులో భాగంగానే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ‘హమారా హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించి సీమాంధ్రులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. కొద్ది రోజులుగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించి కాదని, ఆయన విమర్శించింది చంద్రబాబునేనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో టీఆర్‌ఎస్‌కు అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని అన్నారు. అలాగే అందరూ తనను సోదరుడిగా భావించాలని, పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కకు పెట్టేయండంటూ తెలంగాణలో ఉండే సీమాంధ్రులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇది చూసిన కొందరు కేటీఆర్ భలే కవరింగ్ చేస్తున్నాడుగా అనుకున్నారట.