- ఆర్బీఐ బోర్డు సమావేశంలో జైట్లీ
వచ్చే ఆర్థిక సంవత్సరం లోఆర్థిక పరిస్థితి అంతా బాగానే ఉంటుందని, మెరుగుపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోటును పూడ్చడంలో భాగంగా ఎదురవుతున్న సవాళ్లపై ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్బీఐ బోర్డు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ ఉరిజిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి కమిటీ తీసుకున్న వడ్డీ రేట్ల (రెపో రేట్) యథాతథ కొనసాగింపు నిర్ణయం సమతులమైనదని ఆయన అభివర్ణించారు. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, అంతకుముందు సెబీ బోర్డు, ఉన్నతాధికారులతోనూ సమావేశమైన జైట్లీ.. రుణాలకు సంబంధించినంత వరకు చాలా మందికి కార్పొరేట్ బాండ్లపై నమ్మకం పెరిగిందని చెప్పారు. మరో వైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక్కోసారి అవి అకస్మాత్తుగా పడిపోతాయని, గత మూడు రోజుల పరిస్థితిని చూస్తే ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయని ఆయన గుర్తు చేశారు.