కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయావకాశాలు తమకే ఎక్కువగా ఉన్నాయని హస్తం పార్టీ నమ్ముతోంది. అందుకే ఎక్కువగా ఈ మూడు రాష్ట్రాలపైనే పార్టీ హైకమాండ్ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎక్కువ స్థానాలు ఉండటం, పెద్ద రాష్ట్రాలు కూడా కావడంతో సర్వేలు తమకు అనుకూలంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కూడా తమకు కలసి వచ్చే అంశంగా హస్తం పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది.అయితే ఇదే పెద్ద చికాకుకును కల్గిస్తోంది. నిత్యం హస్తినలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆశావహుల నినాదాలతో హోరెత్తి పోతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో అసెంబ్లీ సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంటోంది. రాజస్థాన్ ను ఇప్పటికే హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. రాహుల్ సభలకు, సచిన్ పైలెట్ రోడ్ షోలకు విపరీతంగా ప్రజలు వస్తుండటం, ముఖ్యమంత్రి వసుంధరద రాజే పై ఉన్న వ్యతిరేకత తమను ఖచ్చితంగా అందలం ఎక్కిస్తుందని హస్తం పార్టీ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలోనూ రోజూ ఏఐసీసీ కార్యాలయం వద్ద రాజస్థాన్ కు చెందిన ఆశావహులు తమ మద్దతుదారులతో హల్ చల్ చేస్తున్నారు. నినాదాలతో హెోరెత్తిస్తున్నారు.ఇక మరో పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. అక్కడి ప్రభుత్వం మూడు దఫాలుగా అధికారంలో ఉండటంతో ఈసారి విజయం తమదేనన్న ధీమాలో హస్తం పార్టీ పెద్దలున్నారు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియా కలసి పనిచేస్తే విజయం ఖాయమని ఖచ్చితంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదని, త్వరలోనే వీరి ముగ్గురితో రాహుల్ సమావేశం నిర్వహించి విభేదాలను పరిష్కరిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇక్కడ పొత్తులు ప్రధాన అడ్డంకిగా మారాయి. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలుండగా చిన్న పార్టీలతో కలసి వెళదామని కాంగ్రెస్ భావించింది.అయితే ఎక్కువ స్థానాలు కోరుతుండటం వీరికి మింగుడుపడటం లేదు. ఇప్పటికే బీఎస్పీ ఇక్కడ వేరుకుంపటి పెట్టుకుంది.ఇక ఛత్తీస్ ఘడ్, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. తెలంగాణలో మహాకూటమి ఏర్పడినా సీట్ల పంపకం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్న రాష్ట్ర నేతలు సీట్ల పంపంకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోటీ దారులు ఎక్కువగా ఉండటంతో సీట్లు ఎవరికెన్ని కేటాయిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి అసంతృప్తిని వ్యక్తం చేసింది. చంద్రబాబుతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యాక కొంత క్లారిటీ వచ్చినా ఇంకా సీట్ల సర్దుబాటు తేలలేదు. మొత్తం మీద కాంగ్రెస్ కు కొంత గ్రాఫ్ పెరగడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉండటం, టిక్కెట్లు రాని వారు రెబెల్స్ గా బరిలోకి దిగి నష్టం చేకూరుస్తారేమోనన్న ఆందోళన పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది