కర్ణాటకలో ఉప ఎన్నికలను మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన కుమారుడు కుమారస్వామి పీఠం కదలకుండా ఉండాలంటే ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత అవసరమని ఆయనకు తెలియంది కాదు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలయితే కాంగ్రెస్ లో అసంతృప్తులు గళమెత్తడమే కాకుండా, బీజేపీ పంచన చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంల దళపతి దేవెగౌడ నేరుగా రంగంలోకి దిగారు. తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే కాకుండా, కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం పర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.దేవెగౌడ మాజీ ప్రధాని మాత్రమే కాకుండా జనతాదళ్ ఎస్ అధినేత. కుమారస్వామికి పార్టీ పగ్గాలు అప్పగించినా ఆయన పార్టీ వ్యవహారాలను ఇప్పటికీ చూస్తుంటారు. ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపే దేవెగౌడ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా ప్రచారం ప్రారంభించడం విశేషం. కర్ణాటక ఉప ఎన్నికల్లో దేవెగౌడ పార్టీ మూడు స్థానాల్లో బరిలోకి దిగింది. శివమొగ్గ, మాండ్య పార్లమెంటు స్థానాలతోపాటు రామనగర అసెంబ్లీ స్థానాల్లో జనతాదళ్ ఎస్ పోటీ చేస్తోంది.శివమొగ్గ పార్లమెంటు స్థానాన్ని దేవెగౌడ ఏరి కోరి తీసుకున్నారు. అక్కడ బీజేపీకి బలం ఎక్కువగా ఉంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సొంత నియోజకవర్గం కావడం, ఆయన కుమారుడు రాఘవేంద్ర బరిలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. బతిమాలినా పోటీకి నేతలు విముఖత చూపారు. ఈ సందర్భంగా దేవెగౌడ రంగప్రవేశం చేసి విదేశాల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు మధు బంగారప్పతో మాట్లాడి పోటీకి ఒప్పించారు. ఇక్కడ జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ కలిస్తే యడ్యూరప్పకు చెక్ పెట్టవచ్చన్నది దళపతి అంచనా.అందుకోసం ఆయన ఎక్కువగా శివమొగ్గలోనే పర్యటిస్తున్నారు. తన కోడలు అనిత పోటీ చేసే రామనగర స్థానంలో ఎటూ విజయం ఖాయమని భావించిన పెద్దాయన శివమొగ్గను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తనకు శత్రువైనా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మనసు విప్పి మాట్లాడారు. సిద్ధరామయ్య దేవెగౌడను విభేదించి జనతాదళ్ ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు కొన్నేళ్ల పాటు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు. అయితే ఈ ఉప ఎన్నికల పుణ్యమా అని ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తుండటం విశేషం. బళ్లారి ప్రచార సభలో ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం కూడా ఆసక్తిగా మారింది. కుమారస్వామి పదవి పదికాలాల పాటు ఉండాలనే లక్ష్యంతో దేవెగౌడ ఈ వయస్సులోనూ శ్రమిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.