తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తతతో టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ ప్రశంసించారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో ''విజిలెన్స్ దర్బార్'' నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది తిరుమల శ్రీవారికి జరిగిన రెండు బ్రహ్మోత్సవాల విజయానికి సమర్దవంతంగా విధులు నిర్వహించిన విజిలెన్స్, నిఘా విభాగం అధికారులు, సిబ్బంది సేవలు అత్యుత్తమైనవని అన్నారు. ఇటీవల తిరుమలలో దర్శనం, వసతి, లడ్డూ, ఆన్లైన్ ఆర్జీత సేవ టికెట్లను అక్రమ మార్గంలో విక్రయించే దళారులను పట్టుకోవడంలో విజిలెన్స్ సిబ్బంది కనబరచిన ప్రతిభను అభినందించారు. టిటిడిలోని నిఘా, భద్రతా సిబ్బంది శారీరకంగాను, మానసికంగాను దృడంగా ఉండి సేవలందిస్తున్నారని అందుకు సహకరిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ప్రత్యేక పర్వ దినాలు, సంవత్సరంలో దాదాపు 100 రోజులు వరకు అధిక రద్దీ ఉండేదని, అయితే ప్రస్తుతం అధిక రద్దీ రోజులు మరింత పెరిగాయని తెలిపారు. అంతకుముందు విజిలెన్స్ సిబ్బంది తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ఇందులో భాగంగా జీత బత్యాల పెంపు, పదోన్నతులు, టిఏ,డిఏ, వాహనాలకు పెట్రోల్ అలవెన్స్లు, వైద్య సదుపాయాలు, లడ్డూకార్డు, ఐడి కార్డు తదితర సమస్యలను ఈవో దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఈవో స్పందిస్తూ విజిలెన్స్ సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విజిలెన్స్ సిబ్బంది సమస్యలపై ఇప్పటికెే టిటిడి బొర్డు సబ్కమిటి ఏర్పాటు చేసిందని, ఇందులో తాను, టిటిడి ఛైర్మన్ సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. కాగా రాబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో విజిలెన్స్ సిబ్బంది సమస్యలపై చర్చించి నిబంధనలకు లోబడి దశలవారిగా పరిష్కరించనున్నట్లు వివరించారు. తిరుపతి జెఈవో పోల భాస్కర్ మాట్లాడుతూ శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడి ప్రతినిధులుగా భద్రాతా సిబ్బంది భక్తులకు మెరుగైన సేవలందిస్తున్నారన్నారు. భద్రతా కల్పించాలన్నారు. టిటిడిలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న విజిలెన్స్, నిఘా విభాగం టిటిడి ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తిరుపతి విజివో అశోక్కుమార్ గౌడ్ వ్యవహరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన విజిలెన్స్, నిఘా విభాగం అధికారులకు, సిబ్బందికి ఈవో జ్ఞాపికలు అందించారు.