కార్తీకమాసం పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం నవంబరు 10వ తేదీ నుండి డిసెంబరు 3వ తేదీ వరకు కృష్ణా రీజియన్ నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ కృష్ణా రీజినల్ మేనేజర్ పి.వి.రామారావు తెలిపారు. బుధవారం ఉదయం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఆర్ఎం రామారావు మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, దాక్షారామంలోని దాక్షారామం, సామర్లకోటలోని కుమార్ భీమేశ్వరమ్ వంటి ఐదు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. నవంబరు 10, 11, 12, 17, 18, 19, 24, 25, 26 తేదీలతో పాటు డిసెంబరు 1, 2, 3 తేదీల్లో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు పండిట్నెహ్రూ బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరి అదే రోజు రాత్రి తిరిగి విజయవాడకు చేరుతాయన్నారు. గతేడాది పంచారామాలకు ఆర్టీసీ 190 ప్రత్యేక బస్సులను నడపగా 3,200 మంది భక్తులు ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని తద్వారా రూ.25 లక్షలు ఆదాయం లభించిందన్నారు. ఈ ఏడాది పంచారామాలకు 120 ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ ఏడాది పంచారామాలకు ఛార్జీలకు సంబంధించి సూపర్ లగ్జరీ బస్సులో పెద్దలకు రూ.880, పిల్లలకు రూ.660, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.630లుగా ఛార్జీలు నిర్ణయించామన్నారు. పైన పేర్కొన్న తేదీలతో పాటు 40/36 మంది బృందంగా కోరితే ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. అలాగే అయ్యప్ప మాలధారణ చేసిన భక్తుల సౌకర్యార్థం టిక్కెట్లు ప్రాతిపదికన, అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా పట్టిసీమలోని ప్రకృతి సోయగాలు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను కూడా నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం త్రిలింగదర్శిని పేరిట యాగంటి ఉమామహేశ్వర స్వామి, మహానంది, శ్రీశైలం మల్లిఖార్జునస్వామి వార్లను దర్శించుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం రామారావు వెల్లడించారు. ఇతర వివరాలకు ప్రయాణికులు సెంట్రల్ మార్కెటింగ్ విభాగం 9959225475 సెల్ నంబరును సంప్రదించాలన్నారు. అనంతరం పంచారామాలు, శబరిమల ప్రత్యేక ప్యాకేజీ, పట్టిసీమ ప్రకృతి సోయగాలు, త్రిలింగదర్శిని ప్రత్యేక బస్సులకు సంబంధించి ఆర్టీసీ తరఫున రూపొందించిన కరపత్రాలు, వాల్పోస్టర్లను ఆవిష్కరించారు