YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                             సర్గ-70

                  జనకుడికి సూర్యవంశ క్రమాన్ని చెప్పిన వశిష్ఠుడు

        జనక మహారాజు ఉదయమే నిద్రలేచి, ప్రాతస్సంధ్యాది కృత్యాలను తీర్చుకొని, పురోహితుడైన శతానందుడుతో తన తమ్ముడి ప్రస్తావన తెచ్చాడు. యిక్షుమతీ నదీతీరంలో వున్న పుష్పకంలాంటి సాంకాశ్య నగరాన్ని, నీతి ధర్మం తప్పకుండా, తన తమ్ముడు కుశధ్వజుడనే రాజు, పాలిస్తున్నాడని అంటాడు. తను చేసిన యజ్ఞాన్ని వాడు కాపాడినవిషయం జనకుడు గుర్తుచేసుకున్నాడు.వాడిని చూడాలనుకుంటున్నానని, జరుగనున్న వివాహమహోత్సవం వాడితో కలిసి అనుభవించాలని వుందని, కాబట్టి అతడిని తీసుకొచ్చేందుకు శీఘ్రంగా పోగలిగే దూతలను పంపాలని చెప్పి ఆ పనికి తగినవారిని పంపించాడు. రాజాజ్ఞ ప్రకారం వేగంగా పోయే గుర్రాలపై దూతలు ఆలస్యం చేయకుండా ప్రయాణంచేసి, కుశధ్వజుడికి జనక మహారాజు చెప్పిన వార్తను తెలియచేశారు. అన్న రమ్మనగానే బయలుదేరి వచ్చిన కుశధ్వజుడు, సంతోషాతిశయంతో, అన్నకు-పురోహితుడికి నమస్కరించి తన ఆసనంపై కూర్చున్నాడు. అన్నదమ్ములిద్దరు తమ ఆసనాలపై కూర్చుని మాట్లాడుకుంటూ, ముఖ్యమంత్రి సుధాముడుని పిలిచి, దశరథ మహారాజుదగ్గరికి పోయి, ఆయనను మంత్రులతోను-పుత్రులతోను వెంటబెట్టుకొని తీసుకొని రమ్మంటాడు. సుధాముడు జనకుడు చెప్పినట్లే దశరథుడు విడిదిచేసిన శిబిరానికి పోయి, ఆయనకు శిరస్సుతో నమస్కరించి, పురోహితుడితో వున్న జనక మహారాజు దశరథుడిని చూడాలనుకుంటున్నాడని చెప్పాడు.
    సుధాముడు ఇలా చెప్పడంతో, దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్ఠుడిని చూపించి, ఇక్ష్వాకువంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు. కార్యాలన్నీ సాధించగల శక్తి వశిష్ఠుడికుందనీ, విశ్వామిత్రుడు-ఇతర మునీశ్వరులు అనుమతిస్తే, తమ వంశ విధాన్ని వశిశ్ఠుడు సందేహానికి ఏమాత్రం తావులేకుండా చెప్పుతాడని అని, మౌనంగా కూర్చుంటాడు. హితులతో-మంత్రులతో-పురోహితులతో కూడి వున్న జనకుడితో వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడీవిధంగా:
    "అవ్యక్తసంభవుడు-నిత్యుడు-అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య. ఇక్ష్వాకుడి తనయుడు కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు, అతడికి అనరణ్యుడు, అతడికి ప్రుథుడు, అతడికి త్రిశంకుడు, అతడికి దుంధుమారుడు (యువనాశ్వుడని కూడా అంటారు), అతడికి మాంధాత, అతడికి సుసంధి కలిగారు. , సుసంధికి ధ్రువసంధి-ప్రసేనజిత్తు అనే ఇరువురు కుమారులు కలిగారు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు యసితుడు. యసితుడి విరోధులైన హైహయులు యుద్ధంలో ఓడించడంతో ఆయన మంత్రులతో పారిపోయి అడవులకెళ్లి, హిమవత్పర్వతం దగ్గర భృగు ప్రస్రవణంలో మితబలుడై నివసించాడని విన్నాను. యసితుడికి ఇద్దరు భార్యలు. ఇద్దరూ గర్భిణులే. అందులో ఒకామె తన సవతికి విషం కలిపిన భక్ష్యాన్ని తినడానికిచ్చింది. భృగువంశంలో పుట్టిన చ్యవనుడనే మహర్షి వీరుండే చోటుకొచ్చాడొకనాడు. యసితుడి భార్య కాళింది ఆయనతో, తనకు పుత్రుడు కలిగేట్లు అనుగ్రహించమని కోరడంతో, ఆమె శూరుల్లో శ్రేష్ఠుడైన కొడుకును కంటుందని చెప్పాడు. ఆమెకు పుట్టనున్న కొడుకు గరళంతో పుడతాడు కనుక అతడి పేరు సగరుడని, అతి బలవంతుడవుతాడని అంటాడు చ్యవనుడు కాళిందితో. ఆయన చెప్పినట్లే సగరుడిని కనింది కాళింది".
    "సగరుడి కుమారుడు అసమంజుడు-అసమంజుడి కొడుకు అంశుమంతుడు-అంశుమంతుడి కుమారుడు దిలీపుడు-దిలీపుడి కొడుకు భగీరథుడు-భగీరథుడి కొడుకు కకుత్థ్సుడు-అతడి కొడుకు రఘుడు-అతడి కొడుకు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుడికి శంఖణుడు-అతడికి సుదర్శనుడు-అతడికి అగ్నివర్ణుడు-అతడికి శీఘ్రగుడు-అతడికి మరువు-అతడికి ప్రశుశ్రుకుడు-అతడికి అంబరీషుడు-అతడికి నహుషుడు-అతడికి యయాతి-అతడికి ఆభాగుడు-అతడికి అజుడు-అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులు. ఇలా వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైంది. వీరందరు అసమాన ధర్మరతులు-వీరులు. సత్యమంటే ప్రీతికలవారు". ఇలా సూర్యవంశ క్రమాన్ని వివరించిన వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణుడికి సరితూగే గుణగణాలుగల తన ఇరువురు పుత్రికలను ప్రేమపూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.     (కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. కులం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల కుల జ్ఞానం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి కులం, తండ్రి కులం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని వదలాలని శాస్త్రం చెపుతున్నది. జాతకర్మాది క్రియలు లేని, పురుష సంతానంలేని, విద్యా శూన్యమై, మిగిలి దీర్ఘ రోగాలు కలదై, మూల రోగాలు కలదై, క్షయ-అజీర్ణం-అపస్మారం-బొల్లి-కుష్ఠు రోగాలు కలదైన వంశాలతో వివాహ సంబంధం చేయరాదు. తోడబుట్టినవాడు లేని పిల్లను, తండ్రెవరో తెలియని దానిని వివాహం చేసుకోకూడదు).
    (ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరుడి తండ్రి అసితుడిని హైహయులు-తాల జంఘులు-మరికొందరు కలిసి రాజ్య భ్రష్టుడిని చేసి తరిమేశారు. ఆయనప్పుడు హిమవత్పర్వతానికి పోయి నివసించాడు. అక్కడప్పుడు సగరుడి తల్లి గర్భవతిగా వుంది. ఆ సమయంలో అసితుడు మరణించాడు. ఆయన భార్య సహగమనం చేయబోతుంటే, చ్యవనుడు వారించి ఆమెను తన ఆశ్రమంలో వుంచి రక్షించాడు. ఆమెకు పుట్టిన సగరుడికి తానే సంస్కారాదులు చేసి, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్ర విద్యలనూ నేర్పాడు. బుద్ధి తెలిసిన సగరుడు తన తండ్రి వివరాలను అడిగితే, తల్లి ఆ వృత్తాంతమంతా వివరించింది. సగరుడు తండ్రిని తరిమిన వారితో యుద్ధంచేసి, ఓడించాడు. గురువాజ్ఞ ప్రకారం వారిని చంపలేదు. వారిలో యవనులను బోడితలల వారిగానూ, శకులను అర్థముండులుగా, బారదులను విరితల వారిగా జాతి భ్రష్టులను చేశాడు. అలా ఆ క్షత్రియులందరినీ స్వాధ్యాయ హీనులుగా-వషట్కార రహితులుగా-స్వధర్మ హీనులుగా చేసి దేశంనుండి వెళ్లగొట్టాడు సగరుడు.వీరే "మ్లేచ్ఛులు".ఇప్పటి తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారే. ఆర్యన్ కు వికృతి "అయిరాన్". అదే ఇరాన్ గా మారింది తదనంతరం).

                                                                     రేపు తరువాయి భాగం.. 

Related Posts