ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ జెండానే ఎగురుతుందా ? లేదా దశాబ్దంన్నర తర్వాత అయినా తిరిగి టీడీపీ జెండా ఎగురుతుందా ? ఇక్కడ రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి? టీడీపీ వర్సెస్ వైసీపీ మథ్య పోటీ ఎలా ఉంటుంది ? ఏ పార్టీ అంచనా ఏంటి ? అన్నదానిపై తెలుగు పోస్ట్ ప్రత్యేక సమీక్షలో చూద్దాం. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లోనూ టీడీపీ వరసగా ఓడిపోతూ వస్తోంది. 1999లో ఇక్కడ నుంచి ఆ పార్టీ తరపున కరణం బలరాం ఎంపీగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. సామాజిక సమీకరణల పరంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన బలరాం ఇక్కడ ఎంపీగా గెలవడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వరుస విజయాలు సాధించారు.గత ఎన్నికలకు ముందు మాగుంట చివరిలో టీడీపీలో జంప్ చేసి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన జగన్ బాబాయ్ వైవీ. సుబ్బారెడ్డి 13 వేల ఓట్ల స్వల్ప తేడాతో శ్రీనివాసులరెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చిన భారీ మెజారిటీతోనే ఇక్కడ ఈ ఎంపీ సీటును ఆ పార్టీ కైవసం చేసుకుంది. యర్రగొండపాలెం అసెంబ్లీ సిగ్మెంట్‌లో టీడీపీ చేతులు ఎత్తేయడంతో అక్కడ వచ్చిన భారీ మెజారిటీ సైతం ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం అయ్యింది. ప్రస్తుతం నియోజకవర్గంలోని ఏడు లోక్‌సభ సెగ్మెంట్లలో రెండు పార్టీల బలాబలాలను పరిశీలిస్తే నియోజకవర్గ కేంద్రమైన ఒంగోలులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య హోరా హోరీ పోరు తప్పేలా లేదు.జనార్ధన్ నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయిలతో అభివృద్ధి చేశారు. అధికార యంత్రంగాన్ని ఇటు పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటు ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళ్లారు. ఇక్కడ హోరా హోరీ పోరు ఉన్నా ప్రస్తుతానికి అయితే టీడీపీ కాస్తో కూస్తో ఎడ్జ్ కనబడుతుంది. జనార్ధన్ సొంత నియోజకవర్గం అయిన కొండపిలో టీడీపీ బలంగా కనపడుతున్నా ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయ స్వామిని చాలా మంది వ్యతిరేకిస్తుండడం…. చివరకు ఆయన్ను మార్చాలని చంద్రబాబుకు సైతం నివేదికలు ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ గ్రూపు రాజకీయాలు సమసిపోని పక్షంలో కొండపిలో టీడీపీకి దెబ్బ తప్పదు. ఇక్కడ వైసీపీ నుంచి సరైన అభ్యర్థి లేక ఆ పార్టీ కొట్టుమిట్టాడుతుంది.ఇక దర్శిలో మంత్రి శిద్ధా రాఘవరావు ఎమ్మెల్యేగా వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తారని ఇక్కడ నుంచి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పోటీ చెయ్యవచ్చని అంటున్నారు. దర్శిలో శిద్ధా కోట్లాది రూపాయిలతో అభివృద్ధి పనులు చేసినా వైసీపీ కూడా తిరుగులేని బలంగా ఉంది. అయితే ఆ పార్టీ నంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తప్పుకోవడంతో బలమైన అభ్యర్థి లేనట్లు అయ్యింది. యర్రగొండపాలెంలో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే వైసీపీ తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పాలపర్తి డేవిడ్‌రాజు ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసినా ఆయనతో పాటు వైసీపీ క్యేడర్ టీడీపీలోకి రాలేదు. అంతేకాకుండా ఇక్కడ క్షేత్ర స్థాయిలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఇక్కడ గెలవడం సంగతి పక్కన పెట్టి గట్టి పోటీ ఇస్తేగొప్పే అనుకునే పరిస్థితి నెలకొంది.టీడీపీ సిట్టింగ్ స్థానమైన కనిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇటీవల చేయించిన పలు సర్వేల్లో సైతం ఆయనపై వ్యతిరేకత ఉన్నట్టు తేలడంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆయన్ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి ఆయన్ను పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రస్తుతానికి ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయనే పోటీ చేస్తారా ? లేదా క్యాండేట్‌ను మారుస్తారా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం కనిగిరి వైసీపీ అనుకూలంగానే ఉంది. వైసీపీ సిట్టింగ్ స్థానమైన మార్కాపురంలో జంకే వెంకటరెడ్డి వివాద రహితుడు అన్న పేరున్నా ప్రతిపక్షంలో ఉండడంతో నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఇక్కడ నాలుగేళ్లుగా పెత్తనం అంతా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డే చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నారాయణ రెడ్డి పోటీ చేస్తారా లేదా చివరిలో అభ్యర్థి మారతారా అన్నదానిపై కూడా చర్చలు నడుస్తున్నాయి.గిద్దలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి టీడీపీలోకి వచ్చాక రెండున్నర ఏళ్లుగా నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయిలతో అభివృద్ధి బాట పట్టించారు. బాగా వెనుక బడిన గిద్దలూరులోని చాలా మండలాల్లో గ్రామాలను అభివృద్థి చేస్తున్నారు. టీడీపీ నుంచి అశోక్‌రెడ్డి పోటీ ఖాయంకాగా వైసీపీ నుంచి ప్రస్తుతానికి ఐవీ. రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పిడతల సాయికల్పన రెడ్డి సైతం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఫైనల్‌గా బీఫామ్ చేతికి వచ్చే వరకు గిద్దలూరు వైసీపీ అభ్యర్థి ఎవరనేది చెప్పడం కష్టం. ఏదేమైనా ఒంగోలు లోక్‌సభ సీటును వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. ఆ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మూడు నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చకపోతే ఇక్కడ ఎంపీ సీటుపై ఆ ప్రభావం ఉంటుందని సైతం చంద్రబాబుకు నివేదించారు. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ. సుబ్బారెడ్డి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదా ఇటీవల వార్తలు వస్తున్నట్టుగా ఆయన్ను తప్పించి ఇక్కడ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతారా ? అన్నది కూడా చూడాల్సి ఉంది.