రాజకీయాల్లో అరుదైన కలయికలు కూడా ఉంటాయి. అలాంటిది తెలుగుదేశం – కాంగ్రెస్ కలయిక. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే… ఎవరి అవసరం ఎవరికి ఉంది? పెద్ద ప్రశ్నే. దానికి ఒక్క వాక్యంలో సమాధానం చెప్పడం కష్టం. అందుకే కొంత చరిత్ర తెలుసుకుంటే సమాధానం దొరుకుతుంది. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పేరు తెగ వినిపిస్తోంది. మళ్లీ ఆయన హవా కనిపిస్తోంది. ఒకపుడు తృతీయ ఫ్రంట్ ను ముందుకు నడిపించి వీపీ సింగ్‌ను ప్రధానిని చేసినపుడు తెలుగుదేశం పాత్ర ఉంది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో రెండు సార్లు ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్ మేకర్’గా చంద్రబాబు మారాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. అప్పట్లో దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించాడు. అపుడే దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుపట్టింది. దీంతో ప్రధానిని మార్చాల్సి వచ్చింది. అపుడు కూడా తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబుకు ప్రధాని అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అది బాబు కెరీర్‌కు పెద్ద కామాగా మిగిలేది. ఎందుకంటే సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని చంద్రబాబు గుర్తించారు. అంతేకాదు, ఒక్కసారి ప్రధాని అయ్యాక మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. అప్పటికి కొడుకు ఇంకా చిన్నవాడు. అందుకే చాలా చురుకుగా ఆలోచించి బాబు ప్రధాని పదవి వదులుకున్నాడు. మళ్లీ బీజేపీ చంద్రబాబు కలిసి 1999లో ఎన్నికలు వెళ్లారు. అపుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబుది కీలకపాత్ర. ఆయన ఏకంగా కన్వీనర్‌గా ఉన్నారు. మళ్లీ 2014 ఎన్నికల్లో ఎన్డీయే చంద్రబాబు కలిసిపోయారు. కానీ సొంత మెజారిటీ వచ్చేటప్పటికి చంద్రబాబు మోడీకి చేదయ్యారు. ఆరోజు నుంచే బాబును దూరం పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు మోడీ. అయితే, రాష్ట్ర అవసరాల దృష్ట్యా చంద్రబాబు వేచిచూశారు. ఫలితం లేదు. దీంతో రాష్ట్రానికి ఉపయోగపడని కేంద్రంతో పొత్తు ఉంటే ఎంత? లేకపోతే ఎంత ? అని చంద్రబాబు బయటకు వచ్చారు. ఈరోజు దేశం తీవ్రమైన దుఃఖంలో ఉంది. అన్ని రంగాలు చతికిల పడ్డాయి. ఆర్థిక, ప్రజాస్వామిక, బ్యాంకింగ్, ఉద్యోగ సంక్షోభంతో దేశం అల్లాడిపోతోంది. మరోవైపు మాటల గారడీ మనిషి అయిన మోడీ ఎదుర్కొనే సత్తాలో రాహుల్ కొంచెం వెనుక పడ్డారు. ఇటీవలే మెరుగయినా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇపుడు కాంగ్రెస్ గెలవకపోతే ఇక ఎప్పటికీ కాంగ్రెస్ ఉండదు. అందుకే సోనియా ట్రబుల్ షూటర్‌గా చంద్ర బాబును ఎంచుకుంది.ఎందుకు చంద్రబాబును సోనియా ఎంచుకుంది? ఉత్తరాదిన కీలక రాష్ట్రం ఉత్తప్రదేశ్. ఆ తర్వాత బీహార్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్టాలున్నాయి. దక్షిణాదిన మహారాష్ట్ర, కర్ణాటక కూడా కీలకమైనవే. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతీయ నేతలందరినీ సోనియా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల్లో వెళ్లే పరిస్థితి. కొన్ని పరిస్థితులు, ఇంకొన్ని ఇగోలు… ఉన్నాయి. రాహుల్ ను పంపడానికి… అతని అనుభవం మాయావతి, నితీష్, పట్నాయక్, దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా వంటి వారి మధ్య పంచాయితీ చేయడానికి పనికిరావడం లేదు. ఆ గ్యాప్ ఫిల్ చేయగిలిన ఏకైక ఆశాదీపంలా వారికి చంద్రబాబు కనిపించారు. పైగా ఈసారి తృతీయ ఫ్రంట్ ఏర్పడి ఓట్లు చీలకుండా ఉండాలంటే… ఆ మూడో ఫ్రంట్ ఏర్పాటుచేసే శక్తి ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ దగ్గర ఉండాలి. దీంతోపాటు రాహుల్ ను లీడర్‌గా ప్రొజెక్ట్ చేయగలిగిన, కూటమిని నిలబెట్టగలిగిన సామర్థ్యం ప్రస్తుతం చంద్రబాబుకు మాత్రమే ఉందని సోనియా గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆయనను రంగంలోకి దింపింది. ఇక చంద్రబాబు కూడా తెలుగువారిని తీవ్రంగా మోసం చేసిన మోడీని ఎలాగైనా దించాలని భీష్మప్రతిజ్ఞతో ఉన్నారు. అది మూడో కూటమితో అవుతుందని బాబు అనుకోవడం లేదు. అందుకే కాంగ్రెస్ సంక్షోభాన్ని పరిష్కరిస్తూనే తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని పరిణతిని వాడుతున్నారు. పైగా కాంగ్రెస్‌తో పొత్తు వల్ల జాతీయ స్థాయిలో తన పలుకుబడి మరింత పెరిగి దేశంలో కీలకంగా మారే అవకాశం రావడం ఏపీని నెం.1 రాష్ట్రం చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏపీలో కాంగ్రెస్ బలపడితే కచ్చితంగా వైసీపీకి దెబ్బ. ఇది తెలుగుదేశానికి ప్రయోజనం. అందుకే కాంగ్రెస్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే.. కాంగ్రెస్‌తో కలవడం వల్ల తెలుగుదేశం క్యాడర్ మళ్లీ కొత్త శక్తిని నింపుకుంది. వీటన్నింటి నేపథ్యంలో 2019 ఎన్నికలు బాబుకు అనుకోని వరం కానున్నాయి.