ఇక గంటల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అధికార కాంగ్రెస్, జేడీఎస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అగ్రనాయకులంతా కలసి కట్టుగా ఉన్నామని క్యాడర్ కు సంకేతాలు పంపుతున్నా ఆశించిన ఫలితం వస్తుందో? రాదో? అన్న అనుమానం పార్టీ నేతల్లో కన్పిస్తోంది. ముఖ్యంగా జనతాదళ్ ఎస్ పోటీ చేసే మూడు స్థానాల్లో కాంగ్రెస్ క్యాడర్ సహకరిస్తుందో లేదో? అన్న డౌట్ వారిని వెంటాడుతోనే ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి.సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత పోటీ చేస్తున్న రామనగరలోనే ఆమె ప్రచారాన్ని స్థానికులు అడ్డుకోవడం గమనార్హం. స్థానికులు అంటే కాంగ్రెస్ కార్యకర్తలే అనిత ప్రచారాన్ని అడ్డుకున్నారని జేడీఎస్ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రామనగర నియోజకవర్గంలో అనిత గెలుపునకు కాంగ్రెస్ పార్టీనేతలు డీకే బ్రదర్స్ తీవ్రంగానే కృషి చేస్తున్నారు. మంత్రి డీకే శివకుమార్, పార్లమెంటు సభ్యుడు డీకే సురేష్ లకు ఈ నియోజకవర్గంలోమంచి పట్టుంది. మంత్రి డీకే శివకుమార్ కు పార్టీ అధిష్టానం బళ్లారి పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన సోదరుడు సురేష రామనగర ప్రచారంలో పాల్గొంటున్నారు. డీకే బ్రదర్స్ ప్రచారంలో అనితకు మద్దతు తెలుపుతున్నా స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి సహకారం కొరవడతుందన్న ప్రచారం జరుగుతోంది.ఇక మాండ్యా పార్లమెంటు నియోజకవర్గంలోనూ అదే పరిస్థిితి. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థి శివరామెగౌడ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలతో పాటు జేడీఎస్ లో ఉన్న అసంతృప్త నేతలూ గలమెత్తుతుండటం విశేషం. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు తాము భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటిస్తుండం రెండు పార్టీలనూ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వారిని బుజ్జగించేందుకు రెండు పార్టీల నేతలూ ప్రయత్నాలు ప్రారంభించారు. శివమొగ్గ పార్లమెంటు నియోజకవర్గంలోనూ జేడీఎస్ అభ్యర్ధి మధు బంగారప్పకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించడం లేదన్న వార్తలు వస్తున్నాయి.అగ్రనేతలందరూ ఒక్కటయి ప్రచారం చేస్తున్నా జేడీఎస్ పోటీ చేసే మూడు స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు సహకరిచడం లేదన్నది వాస్తవం. నిన్న మొన్నటి వరకూ తాము ప్రత్యర్థిగా భావించిన జేడీఎస్ ను అక్కున చేర్చుకునే పరిస్థితిలో కిందిస్థాయి క్యాడర్ లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ కాంగ్రెస్ నేతలతో దీనిపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వంటి నేతలు జేడీఎస్ అగ్రనేతలతో కలిసి ఒకే వేదికను పంచుకుంటున్నా క్షేత్రస్థాయిలో దాని ఫలితం కనపడటం లేదంటున్నారు. మొత్తం మీద జనతాదళ్ ఎస్ పోటీ చేసే మూడు స్థానాల్లో కాంగ్రెస్ క్యాడర్ హ్యాండిస్తుందేమోన్న అనుమానం జేడీఎస్ నేతల్లో బలంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.