రాష్ట్రంపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలకు నిరసనగా వచ్చే నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళావెంకటరావు తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వీర్యం చేసి, అప్రదిష్ట పాల్జేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమై దేశాన్ని రక్షించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సీబీఐలోని లుకలుకలు, ఆర్బీఐలో సమస్యలు దేశ ప్రతిష్ట మంటగలుపుతున్నాయన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోగా, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అస్థిరపర్చడానికి ప్రధానమంత్రినరేంద్రమోడి, బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకుని, కక్షసాధింపు చర్యలకు పాల్పడడం అత్యంత బాధాకరమన్నారు. టీడీపీ ముఖ్య నాయకులు, పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారి ఇళ్లపైనా ఐటీ దాడులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్షపూరిత చర్యలు సరికాదన్నారు. ఇటువంటి దాడులకు ఎవరూ భయపడరని మంత్రి కళావెంకటరావు స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా వచ్చే నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు, నాయకులతో భారీ ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు మంత్రి కళావెంకటరావు తెలిపారు.