వెస్టిండీస్తో తిరువనంతపురం వేదికగా ఈరోజు జరిగిన ఐదో వన్డేలో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బౌలర్లు రవీంద్ర జడేజా (4/34), బుమ్రా (2/11), ఖలీల్ (2/29) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5x4, 4x6), విరాట్ కోహ్లి (33 నాటౌట్: 29 బంతుల్లో 6x4) దూకుడుగా ఆడటంతో భారత్ జట్టు 14.5 ఓవర్లలోనే 105/1తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. ఐదో వన్డేల ఈ సిరీస్ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకుంది. వైజాగ్ వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదో వన్డేలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ ఘోరంగా విఫలమయ్యారు. తొలి మూడు వన్డేల్లో అద్భుతంగా రాణించిన విండీస్ ఆటగాళ్లు.. నాలుగో వన్డే నుంచి చేతులెత్తేశారు. నాలుగో వన్డేలో 153 పరుగులకే ఆలౌటైన కరేబియన్ జట్టు.. ఐదో వన్డేలో మరీ ఘోరంగా 104 పరుగులకే చాప చుట్టేసింది. నాలుగో వన్డేలో 378 పరుగుల భారీ ఛేదనలో తడబడి వికెట్లు పారేసుకున్న విండీస్.. ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసి భారత బౌలర్లకు దాసోహం అయిపోయింది. భారత్పై వన్డేల్లో విండీస్కు ఇదే అత్యల్ప స్కోరు. 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మ్యాచ్లో భారత్పై విండీస్ 121 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకూ భారత్పై వెస్టిండీస్కు అదే అత్యల్ప స్కోరు. ఆ రికార్డును ప్రస్తుత కరేబియన్ జట్టు చెరిపేసింది. 104 పరుగులతో చెత్త రికార్డును నెలకొల్పింది. వాస్తవానికి తొలి మూడు వన్డేల్లో వెస్టిండీస్ 38.58 సగటుతో 926 పరుగులు చేసింది. 24 వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖరి రెండు మ్యాచుల్లో కేవలం 12.85 సగటుతో 257 పరుగులు మాత్రమే చేయగలిగింది. 20 వికెట్లు చేజార్చుకుంది. రెండో వన్డేను టై చేయడం, మూడో వన్డేలో భారత్పై 48 పరుగుల తేడాతో విజయం సాధించడం చూసి.. మిగిలిన రెండు వన్డేల్లో విండీస్ గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. కానీ, భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో విండీస్ బ్యాట్స్మన్ క్రీజులో నిలబడలేకపోయారు. ఆఖరి వన్డేలో రెండు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి రెండు వికెట్లు డకౌట్లే కావడం విశేషం. రోవ్మన్ పావెల్(16), మార్లోన్ శామ్యూల్స్(24), జాసన్ హోల్డర్(25) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో జడేజా అత్యధికంగా 4 వికెట్లు తీశాడు.