పాకిస్థాన్, చైనా మధ్య బస్సు సర్వీస్‌పై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను దెబ్బ తీయడమే అవుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయమై తమ నిరసనను చైనా, పాకిస్థాన్‌లకు తెలిపినట్లు వెల్లడించింది. పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి చైనాలోని తష్‌కుర్గాన్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభించాలన్న ప్రతిపాదనపై భారత్ మండిపడింది. చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా ఈ బస్సు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళ్లడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు. అందువల్ల పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా బస్సు సర్వీస్ భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రెండు దేశాల వారికి శుభవార్త అంటూ లాహోర్, తష్‌కుర్గాన్ మధ్య బస్సు సర్వీస్ మొదలవబోతున్నదని చైనా, పాకిస్థాన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ ప్రకటన విడుదల చేసింది.