YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో భూమన కొడుకు ఎంట్రీ

తిరుపతిలో భూమన కొడుకు ఎంట్రీ

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  తిరుపతిలో కొత్త అభ్యర్థి కోసం గాలిస్తున్నారని తెలుస్తోంది.  తిరుపతి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  పోటీ చేయడానికి కొత్త వ్యక్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రెండుసార్లు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేశారు. ఒకసారి గెలుపొందగా,  మరోసారి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉందని ఆపార్టీ నాయకులు పేర్కొంటున్నారు.  భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేయక పోయినా, ఆయన కుటుంబ నుంచి మరొకరు పోటీ చేస్తారనే వార్తలు వినవస్తున్నాయి.కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలోని అన్ని వార్డుల్లోను తిరుగుతూ, వార్డు బాటను నిర్వహిస్తున్నారు. ఆయన కూడా పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినవస్తున్నాయి.  గత రెండు దశాబ్దాలు చూసినట్లయితే తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గానికి అభ్యర్థులు ఇద్దరు మాత్రమే గెలుపొందారు. 1989లో మబ్బు రామిరెడ్డి గెలుపొందగా,  2012 ఉప ఎన్నికల్లో భూమన  కరుణాకర్ రెడ్డి గెలుపొందారు.  మిగిలిన వాళ్లందరూ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.  1994లో ఎ. మోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందగా, 1999లో అదే పార్టీ నుంచి చదలవాడ కృష్ణమూర్తి గెలుపొందారు.2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎం.వెంకటరమణ విజయం సాధించగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు కొణిదెల చిరంజీవి పోటీ చేసి గెలుపొందారు. 2014లో మళ్లీ తెలుగుదేశం నుంచి వెంకటరమణ గెలుపొందగా, ఆయన మరణించిన తరువాత ఆయన సతీమణి సుగుణమ్మ తెలుగుదేశం టికెట్టు నుంచి గెలుపొందారు. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఆ సామాజిక వర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేరు మోసిన నాయకులు లేరు. దీంతో కొత్త నాయకుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఇది వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అభ్యర్థి  వైసీపీలో చేరుతారనే  వార్తలు కూడా వినవచ్చాయి. ఇప్పటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి అభ్యర్థిత్వం  ఉంటుందనే  ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు.  అయితే చివరి నిముషంలో అభ్యర్థి మారే అవకాశాన్ని కూడా కొట్టి వేయడం లేదు.  మరో రెండు నెలల్లో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి

Related Posts