- ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి పలు ప్రైవేటు ఫార్మా కంపెనీలను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడిని హైదరాబాద్ మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి పలు నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, సీళ్లు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులతో ఫోటోలు దిగి వారు తమకు తెలుసని నమ్మిస్తూ.. పలు కంపెనీలను మోసం చేస్తున్నాడు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని మోసం చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.
పల్స్ ఫార్మా కంపెనీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని పొడిగిస్తానని కంపెనీ ప్రతినిధి సురేశ్‌ను నమ్మించి రూ.12 లక్షలు వసూలు చేశాడు. దీంతోపాటు తెలంగాణ సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పేరు మీద నకిలీ లెటర్ హెడ్ తయారు చేసి ఆంధ్రా బ్యాంకుకు పంపాడు. అలాగే ఫార్మాసూటికల్ కంపెనీకి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.7 కోట్ల 72 లక్షలు కావాలని మల్లాపూర్ బ్రాంచ్ మేనేజర్‌కు లెటర్ పంపాడు.