YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                                       సర్గ-71

                          తన వంశక్రమాన్ని వశిష్ఠుడికి చెప్పిన జనకుడు

ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్ఠుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడీవిధంగా: "మునీంద్రా, కన్యాదానం చేసేవాడు మంచి కులంలో పుట్టినవాడైతే తన వంశం గురించి తెలపడం అత్యంతావశ్యకం. మా వంశానికి పూర్వుడు మిక్కిలి ధర్మాత్ముడైన నిమి. అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడు. ఆయనే మొదటి జనకుడు. ఆ పేరే మా వంశంలో జనకుడు అని రాసాగింది. అది వంశనామమే అయింది. మిథి కొడుకు కుదావసువు. అతడి పుత్రుడు నందివర్దనుడు-ఆయన కొడుకు సుకేతుడు-అతడి కుమారుడు దేవరాతుడు. దేవరాతుడికి బృహద్రధుడు జన్మించాడు. ఆయనకు మహావీరుడు పుట్టాడు. మహావీరుడి కొడుకు సుధృతి. అతడి కొడుకు ధృష్టకేతువు-ఆయన కొడుకు హర్యశ్వుడు-ఆయన కొడుకు మరువు-ఆయన కుమారుడు ప్రతీంధకుడు-ఆతడి కొడుకు కీర్తిరథాక్యుడు-అతడి కొడుకు దేవమీఢుడు-అతడి కొడుకు విబుధుడు-అతడి కొడుకు మహీధ్రకుడు-అతడికి కీర్తిరాతుడు-కీర్తిరాతుడికి మహారోముడు-మహారోముడికి స్వర్ణరోముడు-అతడికి హ్రస్వరోముడు జన్మించారు”.
    “హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు వారిలో నేను పెద్దవాడిని. నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి తపస్సు చేసేందుకు అడవికి పోతూ వీడిని నాకప్పగించి కొంతకాలానికి మరణించాడు. జనకుడనబడే నేను ఇతడిని కాపాడుతున్నాను. సాంకాశ్య పురపతి సుధన్వుడనేవాడు సీతను-శివుడి ధనస్సును తనకిమ్మని దూతలను పంపాడు. నేనొప్పుకోనందున వాడికీ-నాకు భయంకరమైన యుద్ధం జరిగింది. వాడిని చంపి, నా తమ్ముడిని సాంకాశ్య ప్రభువుగా చేసాను. నేను జ్యేష్టుడను-కుశధ్వజుడు నా తమ్ముడు. శ్రీరామ లక్ష్మణులకు నా కూతుళ్లు సీత-ఊర్మిళలను సంపూర్ణ ప్రీతితో, నీ ఆజ్ఞ ప్రకారం ఇచ్చి వివాహం జరిపిస్తాను".
    వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని, కాబట్టి, ఆయన కొడుకులిద్దరితో గోదానం చేయించడానికి ఇదే సరైన సమయమని చెప్పాడు. చెప్పి ఇలా అంటాడు: " రాజేంద్రా, నేడు మఖా నక్షత్రం. నేటికి మూడోరోజు-అనగా రేపుకాక ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది. ఆ రోజున వివాహం చేద్దాం. నీ కొడుకులతో దానాలు చేయించు. భవిష్యత్ కాలంలో సుఖం కలుగుతుంది".
    (గోదానం-కేశఖండనం- చౌలంలాగా చేయాలిగాని తొడమీద కూచోడం కాదు. మీసాలు మాత్రం పవనం చేయాలి. స్నానంచేసి, మౌనం వహించి పగలంతా గడిపి, సూర్యాస్తమానంకాగానే, గురువు దగ్గర మౌనం వీడాలి. గురువుకు దక్షిణ ఇస్తానని చెప్పి గోమిథునం ఇవ్వాలప్పుడు. దీనికి గోదానం అనిపేరు. ఇది మొదలు చేసిన తర్వాత సమావర్తనం చేయాలి. గోదానం, సమావర్తనం చేయకుండా వివాహం జరిపించరాదని మనుస్మృతిలో చెప్పబడింది. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు వివాహం చేద్దామని జనకుడు మరో విషయం చెప్పాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రం శ్రీరామచంద్రమూర్తికి శుభకరమే కాని సీతకు జన్మ నక్షత్రం. అయినా గాని, తిథి-వార-నక్షత్ర దోష శాస్త్రం ప్రకారం, అభిజిత్సర్వదోషఘ్నం అయినందున, ఆ లగ్నమే మంచిది. అదే నక్షత్రంలో మొదటి పాదం తర్వాత ఆమెది కన్యారాశి అయినందున, తృతీయ ఏకాదశ రూప నక్షత్రకూట శుద్ధి కావడంతో నక్షత్ర దోషం లేదు. అయినా, భార్యా-భర్తలిద్దరికి ఏక నాడి అయినందున వియోగప్రాప్తంటారు).

                                                                     రేపు తరువాయి భాగం.. 

Related Posts