జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పోరాట యాత్రను ప్రారంభించనున్నారు. ప్రజాపోరాట యాత్రను ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ మూడు విడతలుగా నిర్వహించారు. తొలిసారి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించిన పవన్ పార్టీకి ఊపు తెచ్చారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు నిర్వహించి తూర్పు గోదావరి జిల్లాలో జోష్ నింపారు. ఇలా పవన్ ప్రజా పోరాట యాత్ర విరామాల మధ్య కొనసాగుతుంది. మరోసారి ప్రజా పోరాట యాత్రను నేటి నుంచి జనసేనాని ప్రారంభించనున్నారు. తూర్పు గోదావరి జల్లా తుని నుంచి నాల్గో విడత ప్రజా పోరాట యాత్ర ప్రారంభం కానుంది.ఇక ఈసారి పవన్ తన యాత్రను విన్నూత్న పద్ధతిలో కొనసాగించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు సూపర్ సక్సెస్ కావడంతో జనసేన నేతలు, క్యాడర్ లోనూ ఉత్సాహం పెరిగింది. ఇటీవల పార్టీలోకి చేరికలు కూడా ఎక్కువవుతున్నాయి. అయితే ఈసారి తుని ప్రజాపోరాట యాత్రను పవన్ విన్నూత్నంగా నిర్వహించనున్నారు. ఈసారి రైలు మార్గం ద్వారా తునికి చేరుకునేలా జనసేన పవన్ టూర్ ను ప్లాన్ చేసింది. దీనికి జనసేనానితో రైలు ప్రయాణం అని నామకరణం కూడా చేశారు.అయితే రైలు మార్గంలో ప్రతి స్టేషన్లో పవన్ తన అభిమానులను కలిశారు. నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట,అన్నవరం స్టేషన్ల మీదుగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ సాయంత్రం ఆరు గంటలకు తుని చేరుకుంది. ఈ స్టేషన్లలో పవన్ తన అభిమానులను కలుస్తారు. అలాగే రైల్లోనే రైల్వే పోర్టర్లతోసమావేశం నిర్వహిస్తారు. అసంఘటిత కార్మికులు, మామిడి, చెరుకు రైతులు, విద్యార్థులు, ఏటికొప్పాక బొమ్మల తయారీదారులు, చేనేత కార్మికులతో పవన్ సమావేశాలు రైలులోనే కొనసాగేలా పార్టీ ప్లాన్ చేసింది.మమేకమవ్వాలనే పవన్ టూర్ ఇలా ప్లాన్ చేశారు. తునిలో బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. రైలు ఆగే ప్రతి స్టేషన్లోనూ జనసేన అభిమానులు నిండిపోయేలా ఒక పండగ వాతావరణం నెలకొనేలా కార్యక్రమాన్నిరూపొందించారు. ఇప్పటికే విజయవాడలోనే పార్టీ కార్యాలయం, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న పవన్ కల్యాణ్ పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితమవుతారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్యునిస్టు పార్టీలతో కలసి వెళ్లాలని పవన్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రైలు ప్రయాణం కావడంతో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కు సూచిస్తున్నారు. మరో వైపు ప్రజా సమస్యలు, జనసేన పార్టీ ఆశయాలకు ప్రయాణికులకు వివరిస్తారు. యాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జనసేన.. తమ పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు కూడా చేసింది. యాత్రకు వచ్చే వారు టికెట్లు తీసుకుని, వాటిని బ్యాడ్జీలుగా పెట్టుకోవాలని, రైలు ప్రయాణికులకు, భద్రతా సిబ్బందికి ఇబ్బంది కలిగించొద్దని, ప్రయాణంలో జాగ్రత్తగా ఉండి, పెద్దలను, మహిళలను గౌరవించాలని కోరింది. పవన్ నిర్వహిస్తున్న ఈ యాత్రపై కొందరు ‘‘పాదయాత్ర, బస్సుయాత్ర అయిపోయాయి.. ఇప్పుడు రైలు యాత్ర.. తర్వాత ఏంటో’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.