YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములా

 కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములా

కొన్నేళ్లుగా ఎన్నికల్లో వరుస పరాజయాలను కాంగ్రెస్ చవిచూస్తున్న విషయం విదితమే దీంతో రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న అన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపద్యంలో సీనియర్ నేతలతోపాటు యవ నేతలను కూడా కలుపుకొని పోయే ప్రయత్నం సాగిస్తున్నదని సమాచారం. దీనికితోడు ఆయా రాష్ట్రాల్లో గెలుపునకు అవకాశముండే అన్ని అంశాలను జతచేర్చుకుంటోంది. దీనిలో భాగంగానే తెలంగాణ‌లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణలో గతంలో అనుసరించిన గుజరాత్ ఫార్ములాను ప్రయోగించాలనుకుంటోందని భోగట్టా. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల సమయంలో కాంగ్రెస్ సోషల్ ఇంజ‌నీరింగ్‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చింది. దీనిలో భాగంగా సామాజిక ఉద్య‌మాల నేతలను ద‌గ్గ‌ర చేసుకుని మరింత బలం పుంజుకుంది. ఇదే రీతిలో తెలంగాణ‌లో కూడా సామాజిక ఉద్య‌మకారుల చేయి కలిపేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. గుజ‌రాత్‌లో ప‌టీదార్ ఉద్య‌మ నేతలైన హార్థిక్‌ ప‌టేల్‌, ఎస్సీల‌పై దాడుల‌ను వ్య‌తిరేకించిన జిగ్నేష్ మేవానీ, బీసీ నేత అల్పేష్ ఠాకూర్ తదితరుల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టడంలో కాంగ్రెస్ విజయం సాధించింది.ఫలితంగా 20 ఏళ్లుగా గుజరాత్ లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీకి ధీటైన పోటీని ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ ఇదే ఫార్ములాను అమలు చేయాలని చూస్తోందట. సామాజిక ఉద్య‌మకారుల మ‌ద్ద‌తు కాంగ్రెస్‌కు ఉండేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ప్ర‌జా గాయ‌కుడు గద్ద‌ర్‌, ఎమ్మార్పీఎస్ నేత‌ మంద కృష్ణ‌మాదిగ, బీసీ ఉద్య‌మ నేత ఆర్‌.కృష్ణ‌య్య‌ తదితర సామాజిక ఉద్య‌మ‌నేతల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కోదండ‌రాం పెట్టిన పార్టీతో కాంగ్రెస్ కూట‌మి జతక‌ట్టిన విషయం విదితమే. తెలంగాణలో టీఆర్ఎస్ వ్య‌తిరేక వర్గాలను ఒక‌చోటికి చేరిస్తే గెలుపు సులభమని కాంగ్రెస్ భావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఇటువంటి నేతలకు ఉన్నత ప‌దవులు ఇస్తామ‌ని ఆశపెడుతున్నదని తెలుస్తోంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ అమలుచేయాలనుకుంటున్న గుజరాత్ ఫార్ములా ఎంతవరకూ వర్క్అవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే.

Related Posts