చంద్రబాబునాయుడు కేంద్రంగా పావులు చకచకా కదులుతున్నాయి. జాతీయంగా పోషించాలనుకుంటున్న పాత్ర, తెలుగుదేశం పార్టీకి గత వైభవాన్ని సాధించే క్రమంలో భాగంగా 2019కి ఆయన గమ్యాన్ని నిర్దేశించుకున్నారు . గడచిన పదిహేను సంవత్సరాలుగా టీడీపీ నేషనల్ ఎరినాలో తన ప్రాధాన్యాన్ని కోల్పోయింది. అంతకుముందు 1996 నుంచి 2004 వరకూ ఎనిమిదేళ్లపాటు టీడీపీ జాతీయ రాజకీయాల్లో చాలా కీలక భూమిక పోషించింది. చంద్రబాబునాయుడు కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో లేకపోవడానికి తోడు టీడీపీ ఒంటరిగా మిగిలిపోయింది. 2014లో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చినప్పటికీ గత వైభవం గగన కుసుమంగానే మిగిలిపోయింది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత కేంద్రంలో పట్టించుకునే నాథుడూ కరవయ్యారు. ఈపరిస్థితుల్లో తన పాత్రను పునర్నిర్వచించుకుంటూ టీడీపీకి తిరిగి ప్రాముఖ్యం తెచ్చిపెట్టే పనిలో పడ్డారు ఆంధ్రా సీఎం. చంద్రబాబునాయుడు రాజకీయంగా డక్కామొక్కీలు తిన్న నేత. ఎన్నోఆటుపోట్లను చవిచూసి రాటుతేలిన నాయకుడు. అతని కుమారుడు లోకేశ్ బంగారు చెంచాతో పుట్టిన వారసుడు. రాజకీయపోరాటాలు, ఆరాటాలు, వ్యూహాలు, ఎత్తుగడలు అంతంతమాత్రంగానే తెలుసు. విద్యార్థి కాలం నుంచి రాజకీయాలే ప్రాణంగా ఎదుగుతూ వచ్చారు చంద్రబాబు. లోకేశ్ కు వారసత్వమే తప్ప ప్రాక్టికల్ గా పొలిటికల్ పాఠాలు పెద్దగా తెలియవు. ఈ నేపథ్యంలో మంత్రిని చేసినా , పార్టీ పగ్గాలు అప్పగించినా రాణించడం అంత సులభం కాదు. తన కనుసన్నల్లో లోకేశ్ ను పార్టీకి, ప్రభుత్వానికి వారసునిగా పీఠం పై కూర్చోబెట్టి తర్ఫీదు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుదే. కుమారుడిని ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టింపచేసి స్థిరపడేలా చూసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. యువ నాయకత్వాన్నిటీడీపీలో క్రమేపీ బలోపేతం చేసే ఏర్పాట్లు పుంజుకుంటున్నాయి. లోకేశ్ కు సమ వయస్కులుగా ఉన్న పాతనేతల వారసులకు ప్రాధాన్యం పెంచుతున్నారు. ఇందుకుగాను సీనియర్లకు వేరే బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయంగా తనపాత్రను పెంచుకొనేందుకు చంద్రబాబు యోచిస్తున్నారు. రాష్ట్ర బాధ్యతలు లోకేశ్ కు అప్పగించి 2019 తర్వాత నేషనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు కీ రోల్ పోషించే అవకాశాలున్నాయనేది పార్టీ వర్గాల సమాచారం.1984 నుంచి 89 వరకూ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్రమేపీ తన ప్రాధాన్యాన్ని కోల్పోయింది. నేషనల్ ఫ్రంట్ కు ఛైర్మన్ గా ఎన్టీరామారావు ఉన్న సమయంలో కేంద్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. 1996లొ చంద్రబాబు నాయుడు కన్వీనర్ గా యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్డీఏలోనూ ఆయనదే హవా. ఆయా సందర్బాలన్నిటిలోనూ తెలుగుదేశం చెప్పిందే మాటగా చెలామణి అయింది. టీడీపీ ఒక జాతీయ స్థాయి పార్టీగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెసు, బీజేపీ తర్వాత అంతటికీలకమైన పార్టీగా గుర్తింపు పొందింది. చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ప్రాబల్యం క్షీణించింది. రాష్ట్ర విభజన తర్వాత అది మరింతగా కుదించుకుపోయింది. 13 జిల్లాలకు పరిమితమైన పార్టీగా బీజేపీ నాయకులు ఎద్దేవా చేయడం ప్రారంభించారు. తాజాగా జాతీయంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో అన్ని పార్టీలతోనూ, ప్రముఖ నాయకులతోనూ పరిచయాలున్న అనుసంధాన కర్త అవసరం పెరిగింది. ఎన్డీఏకు బాబుతో పెద్దగా అవసరం లేదు. తనంతతానుగానే ఆయన బయటికి వచ్చేశారు. మూడో ఫ్రంట్ పెట్టే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. తన పరిచయాలను పునరుద్దరించుకొంటూ జాతీయంగా ఉన్న పొలిటికల్ స్పేస్ ను తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు మద్దతు ఇవ్వమని కోరుతూ అన్నిపార్టీలను కలుస్తూ ఒక ప్రాతిపదికను సిద్దం చేసుకునే పనిలో పడ్డారు.ఎన్డీఏకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమీ కానివాడు అయిపోయాడురు. ఫ్రంట్ ప్రయోగాలకూ పరిస్థితులు సానుకూలంగా లేవు. ప్రాంతీయ పార్టీలు ఛిన్నాభిన్నంగా ఉన్నాయి. తమ అస్తిత్వం నిలుపుకోవడానికే తంటాలు పడుతున్నాయి. బీజేపీ జగన్నాథ రథ చక్రాల కింద పడి నలగకుండా బతికి బట్టకట్టడమే ప్రథమకర్తవ్యంగా ఉంది. అందరూ కలిసి బీజేపీని ఎదుర్కోవాలనే కోరిక ఉన్నప్పటికీ అదెలాగో ఎవరికీ తెలియడం లేదు. అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేక వైఖరిని తీసుకోవడానికి భయపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెసును మినహాయిస్తే మిగిలిన ప్రత్యర్థి ప్రాంతీయ పక్షాలు సన్నాయి నొక్కులకే పరిమితమవుతున్నాయి. బీజేడీ, ఏఐఏడీఎంకే, జేడీఎస్, టీఆర్ఎస్, ఎన్సీపీ, డీఎంకే వంటివన్నీ మధ్యేమార్గంలోనే పోతున్నాయి. ఈ స్థితిలో బీజేపీకి వ్యతిరేకంగా పిల్లి మెడలో గంట కట్టేదెవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిని పూరించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. టీడీపీకి ఇప్పుడు జాతీయంగా పెద్దపార్టీ లేదా కూటమి మద్దతు అవసరం. అలాగే బలహీనపడిన కాంగ్రెసు పార్టీకి ప్రాంతీయ పార్టీలతో దౌత్యం నెరిపే సమన్వయకర్త అవశ్యం. ఈ పాత్రకు సరైన వ్యక్తి చంద్రబాబునాయుడు. అటు టీడీపీ, ఇటు కాంగ్రెసు అవసరాలు ఏకీభవించడంతో చంద్రబాబు కాంగ్రెసుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే పాత్రలోకి మారుతున్నారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనను ఇందుకు తొలి అడుగుగా చెప్పుకోవాలి.