YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొత్త కూటమికి దూరంగా మాయ,మమత

 కొత్త కూటమికి దూరంగా మాయ,మమత

దేశమంతా భారతాయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న టాక్ నడుస్తుండగా, విపక్షాలన్నీ ఏకమై మోదీని ఓడించాలన్న ప్రతిపక్ష పార్టీల లక్ష్యం నెరవేరేటట్లు కన్పించడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు నడుంబిగించారు. కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్న తపనతో చంద్రబాబు ఉన్నారు. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.నిన్న మొన్నటి వరకూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ ఫ‌్రంట్ కూటమికి చాలా ప్రయత్నాలు చేశారు. జనవరిలో భారీ ర్యాలీకి కూడా ప్లాన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తొలినుంచి విపక్షాలను ఏకం చేయాలని ప్రయత్నించిన దీదీ ఈ మధ్య సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రాలేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో విపక్షాల కూటమి ఫెయిలయింది. దీంతో మమత నిరాశతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల నాటికి ఇది సర్దుకుంటుందని శరద్ పవార్ వంటి నేతలు చెబుతున్నా అందుకు పెద్దగా సంకేతాలయితే కన్పించడం లేదు.ఇక అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు కలసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఉప ఎన్నికల్లో చూసిన విజయం వారిని ఒకటయ్యేలా చేసింది. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ ను కలుపుకుని పోవాలని ఉన్నా యూపీలో ఎక్కువ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వకూడదని నిర్ణయం కూడా తీసుకున్నారు. బలంలేని ప్రాంతంలో పట్టుదల ఎందుకని కాంగ్రెస్ కూడా అందుకు మానసికంగా సిద్ధమయినట్లే కన్పిస్తోంది. అయితే యూపీలో విపక్షాల ఓట్లు చీలడానికి మరో సమస్య తలెత్తింది.ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ చీలిపోయింది. ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా పేరుతో కొత్త పార్టీని ఇప్పటికే నెలకొల్పారు. సమాజ్ వాదీ పార్టీ అభిమానులు తన పార్టీలో చేరాలని ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆయన కార్యక్రమాలకు కూడా విశేష స్పందన లభిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇటు తమ్ముడు శివపాల్ యాదవ్ కార్యాలయానికి వెళ్లిన ములాయం ఆయనతో మంతనాలు జరిపారు. తర్వాత అక్కడి నుంచి సమాజ్ వాదీ కార్యాలయానికి కూడా వెళ్లారు. శివపాల్ యాదవ్ మాత్రం అఖిలేష్ అంటేనే మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఓట్లు చీలితే అది ఎవరికి లాభం అన్న లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంమీద వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తపార్టీలు ఆవిర్భవించి అది విపక్షాల ఓట్లను గండికొడతాయన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

Related Posts