నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
తారాగణం: నాగచైతన్య, మాధవన్, నిధి అగర్వాల్, భూమిక, భరత్ రెడ్డి, బ్రహ్మాజీ, సత్య, వెన్నెలకిశోర్, షకలక శంకర్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: యువరాజ్
కళ: రామకృష్ణ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్(సి.వి.ఎం)
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి
సవ్యసాచి..మహాభారతంలో అర్జునుడికి ఉన్న పేర్లలో ఒకటి. రెండు చేతులు సమాన బలం కలిగిన వ్యక్తి అని అర్థం. ఇదే టైటిల్‌తో సినిమా చేశాడు నాగచైతన్య. `ప్రేమమ్` తో చైతన్యకు హిట్ సినిమాను అందించిన దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. లవ్ చిత్రాలతో సక్సెస్‌లు సాధించిన నాగచైతన్యకు ఇప్పటి వరకు యాక్షన్ జోనర్ సినిమాలు కలిసి రాలేదు. అయినా కూడా చందు మొండేటిపై నమ్మకంతో చైతన్య మరోసారి యాక్షన్ జోనర్‌లో నటించాడు. మరి సవ్యసాచితో చైతన్య సక్సెస్ అందుకున్నాడా? లేదా? అని తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ:
హిమాచల్ ప్రదేశ్‌కు 21 మంది టూర్ వెళుతుంటారు. బస్సు ప్రమాదానికి గురవుతుంది. విక్రమ్(నాగచైతన్య) మినహా అందరూ చనిపోతారు. హాస్పిటల్ నుండి బ్రతికి విక్రమ్ అక్క, బావ(భూమిక, భరత్ రెడ్డి) దగ్గరకు వస్తాడు. అక్క కూతురు మహాలక్ష్మి అంటే విక్రమ్‌కి చాలా ఇష్టం. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కారణంగా విక్రమ్ ఎడమ చేయి అతని ఆధీనంలో లేకుండా పనిచేస్తుంటుంది. కోపం వచ్చినా, ఆనందం వచ్చినా ఎడమ చేయి రియాక్ట్ అవుతుంటుంది. అది తనకు పెద్ద సమస్యగా విక్రమ్ భావిస్తుంటాడు. కాలేజ్‌లో చిత్ర(నిధి అగర్వాల్)ను ప్రేమిస్తాడు. అయితే తన కుటుంబం కారణంగా ఆరేళ్ల పాటు చిత్రకు దూరమవుతాడు. యాడ్ డైరెక్టర్ అయిన విక్రమ్ చిత్రను అనుకోకుండా కలుసుకుంటాడు. మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అంత బాగుందనుకుంటున్న తరుణంలో విక్రమ్ అక్కయ్య ఇల్లు గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో పేలిపోతుంది. ఆ ప్రమాదంలో విక్రమ్ బావ చనిపోతాడు. అక్కయ్య తీవ్ర ప్రమాదానికి గురవుతుంది. పాప చనిపోయిందని రిపోర్ట్స్ వస్తాయి. కానీ విక్రమ్‌కు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? అని ఆలోచిస్తున్న తరుణంలో పాప బ్రతికే ఉందని తెలుస్తుంది. అసలు పాప ఎందుకు బ్రతికింది? అసలు విక్రమ్ కుటుంబంపై పగ పట్టిందెవరు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- మంచి పాయింట్
- నాగచైతన్య, మాధవన్ పెర్‌ఫార్మెన్స్
- ప్రీ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
- నెరేషన్ సరిగ్గా లేకపోవడం
- ఫస్టాఫ్ బోరింగ్
- హీరో, విలన్ మధ్య ఆసక్తికరంగా లేని మైండ్ గేమ్
విశ్లేషణ:
సాధారణంగా గర్బధారణ సమయంలో ఓ పిండాలు క్రియేట్ అవుతాయి. సరైన పోషకాహారం లేకపోతే ఓ పిండం నాశనమైపోతుంది. వాటి లక్షణాలు న్యూరాన్స్‌కు చేరిపోవడంతో ఓ పిండంలో శిశువు ట్విన్ లక్షణాలను కనపరుస్తుంటుందనేదే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్. ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు చందు మొండేటి రాసుకున్న కథే `సవ్యసాచి`. రెండు చేతులను సమానంగా ఉపయోగించే వ్యక్తిని సవ్యసాచి అంటారు కూడా. ఈ సినిమాలో ఎడమ చేయి హీరో కంట్రోల్‌లో లేకుండా పనిచేస్తుంటుంది. నాగచైతన్య పాత్రకు తగిన విధంగా చక్కగా నటించాడు. స్టైలిష్ లుక్‌లో చక్కగా కనపడుతూనే వానిషింగ్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తిగా మంచి నటనను కనపరిచాడు. ఇక విలన్‌గా చేసిన మాధవన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్రలో ఒదిగిపోయాడు. ఇక అక్కయ్య పాత్రలో భూమిక, హీరో గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నిధి అగర్వాల్ .. హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో వెన్నెలకిషోర్, సత్య, షకలక శంకర్ అందరూ వారి వారి పాత్రల పరుధుల మేర చక్కగా నటించారు.
ఇక దర్శకత్వం విషయానికి వస్తే కథలో మెయిన్ లైన్ బాగా ఉంది. అయితే సన్నివేశాలను అల్లుకున్న తీరు ఆసక్తికరంగా లేదు. ఫస్టాప్ అంతా పాత్రల పరిచయం.. హీరో కాలేజ్ లవ్ బ్యాక్ డ్రాప్‌తో సీదాసాదాగా సాగుతుంది. ఎటువంటి ఆసక్తి లేకుండా సన్నివేశాలు నార్మల్‌గా అనిపిస్తాయి.ఇక హీరో, విలన్ మధ్య మైండ్ గేమ్, చేజింగ్, యాక్షన్ పార్ట్స్ అన్ని సెకండ్ హాఫ్‌లో ఉన్నాయి. అయితే ఈ సెకండాఫ్‌లో కూడా కొన్ని ఎలిమెంట్స్ మినహా గొప్పగా చెప్పుకునేదేమీ లేదు. కామెడీ పార్ట్ పరావాలేదు. విలనిజం పవర్‌ఫుల్‌గా ఉందంటే అది కేవలం మాధవన్ నటనతోనే.. సన్నివేశాలను ఆసక్తికరంగా మలచడంలో చందు మొండేటి సక్సెస్ కాలేదు. కీరవాణి సంగీతంలో టైటిల్ సాంగ్ మినహా మరేదీ బాలేదు. నేపథ్య సంగీతం బావుంది. యువరాజ్ కెమెరా వర్క్ బావుంది. ఎడిటింగ్ బాలేదు. సంభాషణలు అక్కడక్కడా బావున్నాయి.